అనీఖ్ (నాడు) అనీఖ్ (నేడు) నరేష్ గీసిన అనీఖ్ ఊహాచిత్రం
సాక్షి, సిటీబ్యూరో:నగరంలో జరిగిన జంట పేలుళ్ల కేసు దర్యాప్తు ఊహాచిత్రాలతో మొదలైంది. లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన వ్యక్తి (ఆ తర్వాత ఇతడు అనీఖ్ అని తేలింది) ముఖ కవళికల్ని అక్కడున్న నాసిక్‌కు చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పారు. వీటి ఆధారంగా స్కెచ్ రూపొందించడానికి ఎవరిని సంప్రదించాలా? అని నగర పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో వీరికి స్ఫురించిన పేరు నరేష్ కోడె. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధ కేసులు దర్యాప్తు చేసే అన్ని విభాగాలు, అధికారులకు ఈ పేరు సుపరిచితమే. ముంబైకి చెందిన నరేష్ 14ఏళ్ల వయసులో ఈ వృత్తిని స్వీకరించి.. ఇప్పటి వరకు 12వేల మంది అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాలు రూపొందించాడు. వీటిలో అత్యధికం నిందితులను పోలి ఉండగా... సిటీతో సహా మరికొన్ని చోట్ల మాత్రం పోలికలు సరిపోలేదు.
90శాతం సక్సెస్...
2007 ఆగస్టు 25న రాజధానిలో జంట పేలుళ్లు చోటుచేసుకున్న తర్వాత ప్రాథమికంగా దర్యాప్తు చేసిన నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కోడెను సంప్రదించింది. హుటాహుటిన ముంబై నుంచి మరుసటి రోజే నగరానికి వచ్చిన నరేష్ లుంబినీపార్క్‌లో క్షతగాత్రులైన బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఊహా చిత్రాన్ని రూపొందించి అందించాడు. దీని ఆధారంగానే నగర పోలీసులు నిందితులను పట్టించిన వారికి అప్పట్లో రివార్డు ప్రకటించారు. 2009లో ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటుచేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ఊహాచిత్రం రూపొందించి నిందితుడిని పట్టుకోవడానికి మహారాష్ట్ర పోలీసులకు ఎంతో సహకరించాడు. ముంబైలో జరిగిన 7/11 బ్లాస్ట్, పుణెలోని జర్మన్ బేకరీ పేలుడు, ఘట్కోపర్ బ్లాస్ట్, అయోధ్య, వారణాసి పేలుళ్లతో సహా అనేక కీలక ఉగ్రవాద సంబంధ కేసుల్లో ఊహాచిత్రాలు గీసి అందించాడు. 90 శాతం కేసుల్లో ఈయన గీసిన చిత్రాలు నిందితులను పోలి ఉంటాయి. అయితే లుంబినీపార్క్ విషయంలో మాత్రం అలా కాలేదు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అనీఖ్ షఫీద్ సయ్యద్‌కు... కోడె గీసిన ఊహా చిత్రానికీ పొంతనే లేదని అతడు అరెస్టు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment