IM terrorists
-
తీహార్ జైలు ‘ఏకాంత కారాగారం’లో..
సాక్షి, సిటీబ్యూరో: 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో– ఫౌండర్ యాసీన్ భత్కల్‌తో పాటు అతడి అనుచరులకూ 2017లో ఉరిశిక్షలు పడ్డాయి. 2011 జూలై 13న ముంబైలోని జవేరీ బజార్, ఓపెరా హౌస్, దాదర్‌ల్లో జరిగిన పేలుళ్ల కేసుల్లోనూ వీరు నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కొందరి సాంకేతిక అరెస్టు, మరికొందరిపై అభియోగాల నమోదు పూర్తి కాలేదు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐఎం ఉగ్రవాదులైన యాసీస్ భత్కల్, తెహసీన్ అక్తర్ అలియాస్ తబ్రేజ్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ తదితరుల కోసం ముంబై పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ ఉగ్రవాదులు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరులలో జరిగిన విధ్వంసాలకు సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నారు. తీహార్ జైలు ‘ఏకాంత కారాగారం’లో.. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2008లో జరిగిన అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 2017 ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్‌తో పాటు తబ్రేజ్, వఖాస్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తిహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచగా... మిగిలిన వాళ్లూ అక్కడి జైల్లోనే ఉన్నారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను బెంగళూరు న్యాయస్థానం తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారిస్తోంది. ముంబై విచారణకు అడ్డంకులు... 2011 నాటి ముంబై పేలుళ్ల కేసును అక్కడి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేసింది. ఇది అక్కడి ఎంకోకా కోర్టు పరిధిలో ఉంది. జవేరీ బజార్, ఓపెరా హౌస్, దాదర్ వి«ధ్వంసాల కేసుల్లో యాసీన్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లిన ఏటీఎస్ సాంకేతికంగా అరెస్టు చూపింది. అయితే అప్పట్లో పేలుడు పదార్థాలకు తీసుకువెళ్ళి ఆయా చోట్ల పెట్టిన తబ్రేజ్, హడ్డీలపై ఇంకా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మరోపక్క యాసీన్‌పై అభియోగాలు నమోదు చేయాలన్నా అతడిని కోర్టు ఎదుట హాజరపరచాల్సి ఉంది. భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల్ని ఢిల్లీలోని తిహార్ జైలు దాటి బయటకు తీసుకువెళ్లకుండా కేంద్రం ఓ ఉత్తర్వు జారీ చేసింది. యాసీన్ హైదరాబాద్ జైల్లో ఉండగానే అతడిని తప్పించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో పాటు ఐసిస్ వంటివీ ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో కేసు విచారణ కోసం చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ పరిణామా ల నేపథ్యంలోనే కేంద్రం ఈ ఉగ్రవాదుల్ని తిహార్ జైల్లోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఏటీఎస్ అధికారులు ఎంకోకా కోర్టుకు విన్నవించారు. జాప్యం కోసమే అడ్డంకుల సృష్టి.. పేలుళ్లు చోటు చేసుకుని తొమ్మిదేళ్లు గడిచిపోవడం, ఈ ఉగ్రవాదుల్ని ఢిల్లీ నుంచి బయటకు తీసుకువచ్చే ఆస్కారం లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేయించాలని కోరుతూ ఏటీఎస్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అదే పంథాలో అభియోగాలు నమోదు చేస్తామని కోరారు. దీన్ని వ్యతిరేకిస్తూ యాసీన్ సహా ఇతర నిందితులు కోర్టులో తమ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఈ పిటిషన్ దాఖలు పూర్వాపరాలను నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసు విచారణకు అడ్డంకులు సృష్టించడం ద్వారా జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నాడని భావిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పేలుళ్ల కేసులో యాసీన్, తబ్రేజ్, వఖాస్‌లకు ఉరి శిక్ష పడింది. దీనికి సంబంధించిన ఇతర ఫార్మాలిటీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ సైతం పూర్తయితే ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావాలంటే ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ ముందుకు సాగకుండా చేయాలని యాసీన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసమే ఇలాంటి రకరకాల కారణాలతో పిటిషన్ల దాఖలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి. మరోపక్క భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ భత్కల్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు. గతంలో ఓ సందర్భంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ తీసుకువెల్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలికాప్టర్ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. -
ఐఎం ఉగ్రవాదులకు కలిసొచ్చిన చేపల వేట విధానం
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని తీర ప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు అవలంభించే విధానమే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, పుణె, ముంబై, బెంగళూర్లలో పేలుళ్లకూ బాంబులు తయారు చేయడానికి ముష్కరులు ‘మీన్ తూటా’ ల నుంచే పేలుడు పదార్థం సేకరించారు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. తనకున్న పరిచయాలతో తొలినాళ్లలో అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకునేవాడు. అయితే దేశంలోని కొన్ని చోట్ల విధ్వంసాలు జరగడం, ఆ బాంబుల్లో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు తేలడంతో నిఘా పెరిగింది. దీంతో పేలుడు పదార్థం సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న రియాజ్ కన్ను మీన్ తూటాలపై పడింది. ఇదీ ‘మీన్ తూటా’... కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి, శిరుల్గుప్ప తీరప్రాంతాల మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ (పేస్టులా ఉండే పదార్థం) ప్యాకెట్ లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో ఆ ప్రాంతంలోని చేపలన్నీ చనిపోయి పైకి తేలుతాయి. దీన్నే అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. మీన్ అంటే చేప, తూటా అంటే పేలేది అని అర్థం. ఈ విధానం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దేశం దాటే వరకు... ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడడంతో నిర్మాణరంగంలో వినియోగించడానికి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన రియాజ్ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. 2008లో దేశం దాటే వరకు తానే సమీకరించాడు. ఆ ఏడాది ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో దేశం దాటేశాడు. ఆ తర్వాత పేలుడు పదార్థం సమీకరించే మార్గం తెలిసినప్పటికీ.. దాన్ని ఎలా సేకరించాలి? ఎవరితో అవసరమైన వారికి అందించాలి? అంశంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. భత్కల్ ప్రాంతానికి చెందిన అనేక మందికి ఎరవేసిన రియాజ్... అనుచరుడు అఫాఖీని ‘మీన్ తూటా’లు ఖరీదు చేయడానికి వినియోగించుకున్నాడు. పాక్ నుంచి రియాజ్ ఇచ్చే ఆదేశాల ప్రకారం అఫాఖీ పని చేసేవాడు. చేపల వేటకని మీన్తూటాలు తెప్పించేవాడు. వీటిలోని స్లర్రీ ప్యాకెట్లను పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు అనుచరుల ద్వారా పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా.. ఉత్పత్తి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తర్వాత అందులోని శక్తి తగ్గిపోయి పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఐఎం ఉగ్రవాదులు చిన్నస్వామి స్టేడియం, జంగ్లీ మహరాజ్ రోడ్లలో పేలుళ్లకు వినియోగించిన స్లర్రీ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా దాంతో తయారు చేసిన బాంబులు పేలడంతో తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. ముష్కరుల తరలింపునకు సన్నాహాలు... జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో దోషులుగా తేలిన ఉగ్రవాదులు అనీఖ్, అక్బర్, తారీఖ్లతో పాటు ఈ కేసుల్లో అభియోగాలు వీగిపోయిన సాదిఖ్, ఫారూఖ్‌లను (వీరిపై ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయి. దీంతో జైలు నుంచి బయటకు రారు) ముంబై క్రైమ్ బ్రాంచ్ సహా ఇతర విభాగాల అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల్ని ఆయా కారాగారాల నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే మిగిలిన రాష్ట్రాల వారూ తీసుకెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడి కేసుల విచారణ, శిక్షల విధింపు సైతం పూర్తి కావడంతో తమ తమ కేసులకు సంబంధించి తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం న్యాయస్థానం ఉరిశిక్షలు విధించిన తర్వాత కూడా ముష్కరుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్లపల్లి జైలు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏ కోణంలోనూ పశ్చాత్తాపం కనిపించట్లేదనిపేర్కొంటున్నారు. -
పేలుళ్ల తర్వాతా మరో ఆపరేషన్‌కు కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అనుచరులతో వచ్చి నగరంలో భారీ పేలుళ్లకు పాల్పడ్డాడు. 45 మందిని పొట్టనపెట్టుకోవడంతోపాటు మరెందరినో క్షతగాత్రులుగా మార్చాడు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత కొన్నేళ్లపాటు నగరానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు రావడానికి, తన అనుచరుల్ని పంపడానికి ఎవరూ సాహసించరు. అయితే, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ తీరే వేరు. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన అతడు మరో ఆపరేషన్ నిమిత్తం 2008 ఫిబ్రవరిలో ఒక అనుచరుడిని సిటీకి పంపాడు. 2009లో అరెస్టులపర్వంతో అది ఆగిపోయింది. జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐఎం ఉగ్రవాదులు అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు కోర్టు నేడు(సోమవారం) శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులకు సంబంధించి ఫారూఖ్, సాదిఖ్ షేక్‌లపై అభియోగాలు కొట్టేసింది. మరో కీలక నిందితుడు, బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ తారీఖ్పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎం నేతృత్వంలో రియాజ్ భత్కల్ సూత్రధారిగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఈ కేసుల్లో దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఆ ఏడాది డిసెంబర్ 19న న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆ రోజు కూడా సోమవారమే కావడం గమనార్హం. డాక్టర్నే ట్రాప్ చేసిన రియాజ్ మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని రోహరీ జిల్లాకు చెందిన అన్వర్ అబ్దుల్లా ఘనీ భగ్వార్ పూనెలోని ససూన్ హాస్పిటల్‌కు చెందిన బీజే మెడికల్ కాలేజీ నుంచి 2006లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐఎంకు చెందిన ఆసిఫ్ బషీరుద్దీన్ షేక్ ప్రోద్బలంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. రియాజ్ భత్కల్‌కు కీలక అనుచరుడిగా మారాడు. అన్వర్‌ను రియాజ్ భత్కల్ హైదరాబాద్‌కు పంపి మరో ఆపరేషన్ చేపట్టాలని కుట్రపన్నాడు. ఇందులో భాగంగా 2008 ఫిబ్రవరిలో మెడిసిన్‌లో ఎండీ చేయడానికంటూ అన్వర్‌ను పూనె నుంచి హైదరాబాద్ పంపాడు. నదీంకాలనీలో అన్వర్ ప్రాక్టీసు నిర్వహిస్తుండగానే 2008 సెప్టెంబర్‌లో ముంబై పోలీసులు 20 మంది ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్ పేలుళ్లతోపాటు అన్వర్ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే ఉన్న అన్వర్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆధారాలు లభించడంతో 2009 జనవరిలో అరెస్టు చేశారు. -
జంట పేలుళ్ల కేసులో నేడే తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జరిపిన జంట బాంబు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబుల కు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండ టంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవే ‘తొలి–ఆఖరి’ కేసులు... పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్ర వాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికా రులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
అశ్లీలంలో ఐడీల గుట్టు!
* ‘స్టఫ్ మై స్టాకింగ్స్’ పుస్తకం ఆధారంగా మెయిల్ ఐడీల సృష్టి * నిఘా వర్గాలకు చిక్కకుండా రూపొందించిన ఐఎం ఉగ్రవాదులు * పుస్తకం వివరాలను ఎట్టకేలకు గుర్తించిన దర్యాప్తు అధికారులు సాక్షి, సిటీబ్యూరో: దిల్సుఖ్నగర్ లో పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు సమాచారమార్పిడికి వినియోగించిన ఐడీలను అశ్లీల సాహిత్య పుస్తకం ఆధారంగానే సృష్టించినట్లు తేలింది. దాదాపు ఏడాదికి పైగా ఈ పుస్తకం పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఎట్టకేలకు అది ‘స్టఫ్ మై స్టాకింగ్’గా గుర్తించాయి. పాకిస్థాన్‌లో ఉన్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించాడు. ఈ బాధ్యతల్ని తన సోదరుడు యాసీన్ భత్కల్‌కు అప్పగించాడు. ఆపరేషన్ పూర్తి చేసేందుకు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్‌లను రంగంలోకి దింపాడు. సమాచారమార్పిడికి ఫోన్లపై ఆధారపడితే తేలిగ్గా నిఘా వర్గాలకు దొరికే ప్రమాదం ఉందని వాటికి పూర్తి దూరంగా ఉన్నారు. కేవలం ఈ-మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని రియాజ్ సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తన మెయిల్ ఐడీ నుంచి మిగతా వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మెట్లో ఉన్న ఓ పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తూ సమాచారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నెంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలి. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉన్న నేపథ్యంలో ఎవరి ఐడీ ఏమిటి? అనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. ఎక్కువగా సంప్రదింపులు జరిపిన వారు ఎక్కువ ఐడీలు, తక్కువగా జరిగిన వారు తక్కువ ఐడీలు సృష్టించుకున్నారు. 2013లో యాసీన్ భత్కల్ సహా మిగిలిన ఉగ్రవాదులు అరెస్టయినప్పుడు ఓ పుస్తకం ఆధారంగా ఐడీలు సృష్టించినట్టు బయటపడింది. అయితే అది ఏ పుస్తకం అనేది ఎవరూ చెప్పలేకపోయారు. దీంతో అనేక కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన దర్యాప్తు, నిఘా వర్గాలు ఆ పుస్తకం ఇంటర్నెట్లో లభిస్తున్న ‘స్టఫ్ మై స్టాకింగ్స్’గా గుర్తించాయి. ఎవరు, ఏ ఐడీలు వాడారంటే..? .... రియాజ్ భత్కల్ (సూత్రధారి): lovesam361@yahoo.com, patarasingh@yahoo.com, coolallz@yahoo.com, dumzum@paltalk.com. యాసీన్ భత్కల్ (కీలక పాత్రధారి): halwa.wala@yahoo.com, jankarko@yahoo.com, a.haddad29@yahoo.co, hbhaddur@yahoo.com, khalid.k@Nimbuzz.com హడ్డీ (సహాయ సహకారాలు అందించాడు): khalid.k@Nimbuzz, spentthose11@yahoo.com, tashan99@paltalk.com, spentthose@nimbuzz.com మోను (ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద బాంబు పెట్టాడు): laho0@yahoo.com వఖాస్ (107 బస్టాప్ వద్ద బాంబు పెట్టాడు): Ubhot4u@yahoo.com వీరు వాడిన ఇతర ఐడీలు: Jamesusually10, menothing1, davidthapa77, menothing1 (ఇవన్నీ నింబస్‌లో), kul.chitra@yahoo.com, muthumamu80@yahoo.com, jankarko@yahoo.com