పేలుళ్ల తర్వాతా మరో ఆపరేషన్‌కు కుట్ర! | Anik and Akbar punishment will be finalized today in Gokul Chat and LumbiniPark bomb blast case | Sakshi
Sakshi News home page

పేలుళ్ల తర్వాతా మరో ఆపరేషన్‌కు కుట్ర!

Published Mon, Sep 10 2018 2:45 AM | Last Updated on Mon, Sep 10 2018 2:45 AM

Anik and Akbar punishment will be finalized today in Gokul Chat and LumbiniPark bomb blast case - Sakshi

రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు అనుచరులతో వచ్చి నగరంలో భారీ పేలుళ్లకు పాల్పడ్డాడు. 45 మందిని పొట్టనపెట్టుకోవడంతోపాటు మరెందరినో క్షతగాత్రులుగా మార్చాడు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత కొన్నేళ్లపాటు నగరానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు రావడానికి, తన అనుచరుల్ని పంపడానికి ఎవరూ సాహసించరు. అయితే, ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) మాస్టర్‌ మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ తీరే వేరు. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన అతడు మరో ఆపరేషన్‌ నిమిత్తం 2008 ఫిబ్రవరిలో ఒక అనుచరుడిని సిటీకి పంపాడు. 2009లో అరెస్టులపర్వంతో అది ఆగిపోయింది. జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐఎం ఉగ్రవాదులు అనీఖ్‌ షఫీద్‌ సయ్యద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు కోర్టు నేడు(సోమవారం) శిక్ష ఖరారు చేయనుంది.

ఈ కేసులకు సంబంధించి ఫారూఖ్, సాదిఖ్‌ షేక్‌లపై అభియోగాలు కొట్టేసింది. మరో కీలక నిందితుడు, బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన సివిల్‌ ఇంజనీర్‌ తారీఖ్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎం నేతృత్వంలో రియాజ్‌ భత్కల్‌ సూత్రధారిగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాపుల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఈ కేసుల్లో దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఆ ఏడాది డిసెంబర్‌ 19న న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆ రోజు కూడా సోమవారమే కావడం గమనార్హం.

డాక్టర్‌నే ట్రాప్‌ చేసిన రియాజ్‌
మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని రోహరీ జిల్లాకు చెందిన అన్వర్‌ అబ్దుల్లా ఘనీ భగ్వార్‌ పూనెలోని ససూన్‌ హాస్పిటల్‌కు చెందిన బీజే మెడికల్‌ కాలేజీ నుంచి 2006లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఐఎంకు చెందిన ఆసిఫ్‌ బషీరుద్దీన్‌ షేక్‌ ప్రోద్బలంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. రియాజ్‌ భత్కల్‌కు కీలక అనుచరుడిగా మారాడు. అన్వర్‌ను రియాజ్‌ భత్కల్‌ హైదరాబాద్‌కు పంపి మరో ఆపరేషన్‌ చేపట్టాలని కుట్రపన్నాడు.

ఇందులో భాగంగా 2008 ఫిబ్రవరిలో మెడిసిన్‌లో ఎండీ చేయడానికంటూ అన్వర్‌ను పూనె నుంచి హైదరాబాద్‌ పంపాడు. నదీంకాలనీలో అన్వర్‌ ప్రాక్టీసు నిర్వహిస్తుండగానే 2008 సెప్టెంబర్‌లో ముంబై పోలీసులు 20 మంది ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్‌ పేలుళ్లతోపాటు అన్వర్‌ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే ఉన్న అన్వర్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆధారాలు లభించడంతో 2009 జనవరిలో అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement