కాన్పూర్ ఆస్పత్రి మార్చురీ వద్ద పోలీసులకు సన్మానం చేస్తున్న సామాజిక కార్యకర్తలు
కాన్పూర్: పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, డీఎస్పీ సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో గురువారం అరెస్ట్ అయిన తరువాత, దుబేను అక్కడి నుంచి యూపీలోని కాన్పూర్‌కు తీసుకువస్తుండగా, శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ శివార్లలోని భావుంటి వద్ద హైవేపై జనçపసంచారం లేని చోట దుబేను తీసుకువస్తున్న కారు బోల్తా పడింది. ఇదే అదనుగా ప్రమాదంలో గాయపడిన పోలీసు నుంచి పిస్టల్‌ను లాక్కొని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు.
కారు బోల్తాపడిన ఘటనలో, తదనంతర ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సహా 8 మంది పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రమాదం అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆయనను చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ మాటలను వినకుండా, పోలీసులపై.. వారిని చంపే ఉద్దేశంతో దుబే కాల్పులు జరపడం ప్రారంభించాడు. దాంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు’ అని వివరించారు.
గాయపడిన దుబేను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే దుబే చనిపోయాడని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌బీ కమల్ మీడియాకు తెలపడం గమనార్హం. ఆయన మృతదేహంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, మూడు ఛాతీ భాగంలో, ఒకటి చేతిపై ఉందని వివరించారు. పోలీసుల్లో ఒకరికి భుజంపై, మరొకరికి చేతిపై బుల్లెట్ గాయాలున్నాయన్నారు. దుబేకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని చెప్పారు.
మొత్తం ఆరుగురి ఎన్‌కౌంటర్
8 మంది పోలీసుల మృతికి కారణమైన కాన్పూర్ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడైన వికాస్ దుబే సహా మొత్తం ఆరుగురు వేర్వేరుగా జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్లలోనే హతమవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ పట్టణం లోని మహాకాళేశ్వరుడి ఆలయానికి గురువారం దుబే వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అక్కడే అరెస్ట్ చేసి అనంతరం, యూపీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నంచి దుబేను కాన్పూర్‌కు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
కొద్ది గంటల ముందే సుప్రీంలో కేసు
వికాస్ దుబే ఎన్‌కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దు బేను ఎన్‌కౌంటర్లో హతమార్చే అవకాశముందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ ఓ లాయర్ పిటిషన్ వేశారు.
చాప్టర్ క్లోజ్
యూపీ సివిల్ డిఫెన్స్ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఈ ఎన్‌కౌంటర్‌ను ముందే ఊహించారు. ‘వికాస్ దుబే లొంగిపోయాడు. రేపు ఉదయం ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది.ఆ క్రమంలో పోలీసుల చేతిలో చనిపోయే అవకాశం కూడా ఉంది. దుబే చాప్టర్ క్లోజ్ అవుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు.
సమగ్ర దర్యాప్తు జరపాలి
గతవారం పోలీసు బృందంపై వికాస్ దుబే జరిపిన కాల్పుల ఘటన నుంచి నేటి దుబే ఎన్‌కౌంటర్ వరకు అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు.
‘నేరస్తులు చనిపోయారు. కానీ ఇన్నాళ్లు వారిని కాపాడిన వారినేం చేస్తారు?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. మొత్తం ఘటనకు సంబంధించి వాస్తవాలు బయటకురావాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ డిమాండ్ చేశారు.
30 ఏళ్ల నేర చరిత్ర
యూపీలో కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే(56)కు 30 ఏళ్ల నేర చరిత్ర ఉంది. మొత్తం అతనిపై 62 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 5 హత్యలు, మరో ఎనిమిది హత్యాయత్నం కేసులు. వారం క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. 1990లో కాన్పూర్‌లో ఒకరిపై దాడి చేసిన కేసులో వికాస్ దుబే పేరు తొలిసారిగా వినిపించింది. ఆ తర్వాత రెండేళ్లకి కాన్పూర్ శివాలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో దళిత యువకుడి హత్య కేసులో అతను నిందితుడు. ఈ ఘటన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చే సుకొని డాన్‌గా ఎదిగాడు. దోపిడీలు, దొంగతనాలు చేస్తూ రాజకీయాల్ని వాడుకున్నాడు. 1995–96లో బీఎస్పీలో చేరాడు. పోలీసు శాఖలో అతనికి సన్నిహితులు ఎక్కువ. ఎప్పుడైనా ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే వికాస్ దుబేకి ఉప్పందిపోయేది. అలా తన చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
బీజేపీ నేత శుక్లా హత్యతో సంచలనం
2001లో ఆనాటి యూపీ సర్కార్‌లో సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను పట్టపగలు అందరూ చూస్తుండగా పోలీస్‌స్టేషన్‌లోనే చంపడంతో వికాస్ దుబే పేరు వింటేనే అందరిలోనూ వణుకుపుట్టింది. ఆరు నెలల అనంతరం అతను లొంగిపోయాడు. కానీ, కేసు విచారణ సమయంలో పోలీసులే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో 2005లో జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు
వికాస్ సొంతూరు బిక్రులో గత 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. వికాస్ దుబే ఎవరి పేరు చెబితే అతనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కావాలని కలలుగన్నాడు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్లడమే లక్ష్యమని పలుమార్లు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున కాన్పూర్ జిల్లా రణియా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తూనే బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించాడు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు అతని ప్రయత్నాలను సాగనీయలేదని తెలుస్తోంది.
పోలీసుల అదుపులో భార్య, కుమారుడు
వికాస్ దుబే తల్లిదండ్రులు రామ్‌కుమార్ దుబే, సరళాదేవి. తల్లి సరళాదేవి చాలా సంవత్సరాలుగా వికాస్ దుబేని దూరం పెట్టారు. తన చిన్న కుమారుడు దీపూతో కలిసి ఉంటున్నారు. వికాస్ పట్టుబడితే కాల్చి చంపేయమని బహిరంగంగానే చెప్పారు. వికాస్ దుబే భార్య రిచా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. ఘిమవూ పంచాయతీ సభ్యురాలిగా నెగ్గారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండో కుమారుడు షాను లక్నోలో తల్లితో కలిసి ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. వికాస్ భార్య, రెండో కొడుకు, వారింట్లో పనివాడిని పోలీసులు ఇప్పటికే నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది పోలీసుల్ని చంపడానికి చేసిన కుట్రలో రిచా హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు
ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఉజ్జయిన్‌లో అరెస్ట్ చేసే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చూపని దుబే, ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు. దుబేను తీసుకువెళ్తున్న పోలీస్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్న మీడియా వాహనాలను ఒక దగ్గర నిలిపేశారని, అక్కడికి కొద్ది దూరంలో, కాసేపటికే ఎన్‌కౌంటర్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఉజ్జయిన్ నుంచి బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగిన వాహనంలో కాకుండా, వేరే వాహనంలో దుబే కూర్చుని ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలను యూపీ పోలీసులు కొట్టివేశారు. చెక్ చేయడం కోసమే మీడియాను ఆపి ఉండొచ్చని పేర్కొన్నారు. బిక్రు గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇప్పటివరకు 21 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఆరుగురు ఎన్‌కౌంటర్లలో చనిపోయారని ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment