ఉమారాణి మృతదేహం
పొద్దున్నుండి ఇంట్లో చలాకీ గా తిరిగింది.. కుటుంబసభ్యులకు ముచ్చట్లు చెప్పింది.. అంతలోనే ఆ చిన్నారిపై విధి చిన్నచూపు చూసింది. ఆరేసిన దుస్తులు తెచ్చేందుకు బంగ్లాపైకి వెళ్లిన చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కరెంటుషాక్‌తో చిన్నారి అనంతలోకాలకు పయనమైంది. హృదయవిదారకమైన ఈ సంఘటన ఆదివారం నగరంలోని ఇంద్రాపూర్‌లోని సంతోష్‌నగర్‌లో జరిగింది.
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి సంతోష్‌నగర్(ఇంద్రాపూర్)కు చెందిన అనిల్, సునీతకు ముగ్గు రు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. అనిల్ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నకూతురు ఉమారాణి(12) మాణిక్‌భవన్‌లో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఉతికిన దుస్తులను మేడపైన ఆరేశారు. సాయంత్రం వీటిని తీసుకురావడానికి ఉమారాణి మేడపైకి వెళ్లింది.
దండెం పైనున్న దుస్తులు తీస్తుండగా దండెం పక్కనే ఉన్న విద్యుత్ సర్వీస్‌వైరు కిందకు ఊగుతుండడంతో బాలికకు వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమయంలో మేడపై ఎవరు లేకపోవటంతో బాలికను ఎవరు గమనించలేదు. కొద్దిసేపటికి మేడపైకి వెళ్లిన చెల్లెలిని అన్న దేవరాజు పిలువగా పై నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన మేడపైకి వెళ్లాడు. అయితే ఉమారాణి పడిపోయి ఉండడాన్ని గమనించి ఆమెనే లేపేందుకు ప్రయత్నించగా దేవరాజుకు కూడా కరెంట్ షాక్ కొట్టింది.
దీంతో దేవరాజు బిగ్గరగా అరవగా కొంద ఉన్న ఇంట్లోవాళ్లు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కరంట్ షాక్‌తో స్వల్పంగా గా>యపడిన దేవరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 5వ టౌన్ ఎస్సై శ్రీహరి ఘటన స్థలానికి చేరుకుని బాలికను పరిక్షించారు.
బాలిక తలకు కరంట్ షాక్ తగినట్లు గుర్తించారు. ఎస్సై కేసు నమోదు చేసుకుని పాప మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టంగదికి తరలించనున్నట్లు తెలిపారు. స్వల్పగాయాలతో బయటపడిన దేవరాజు చికిత్స అనంతరం కోలుకోవటంతో ఇంటికి పంపించి వేశారు. ఉమారాణి మృతితో సంతోష్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.∙
Comments
Please login to add a commentAdd a comment