
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి అయిన తర్వాత వేరే అబ్బాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయిలను చూసి సిగ్గుపడుతున్నా అంటూ ఓ తెలుగమ్మాయి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
యువతి వీడియోలో ఏం చెప్పిందంటే..
'పెళ్లి అయి భర్త ఉన్నా, వేరే అబ్బాయిలతో సంబంధం పెట్టుకుని భర్తను చంపుతున్న ఆడవాళ్లను ఇటీవలి కాలంలో మనం చాలా చూస్తున్నాం. నాకొచ్చిన కొన్ని ఆలోచనలు మీకు చెబుతున్నా, నా మాట తీరు బాగాలేక పోతే క్షమించండి. పెళ్లి కాని వాళ్లు ఇలా మాట్లాడాలో లేదో కూడా తెలియదు. కాని పరిస్థితులు డిమాండ్ చేయడంతో మాట్లాడుతున్నా, తప్పదు ఎవరో ఒకరు ఇలా మాట్లాడాలి. లేకపోతే మిగతా ఆడవాళ్లకు కూడా చెడ్డ పేరు వస్తోంది. పెళ్లి అయిపోయి పక్కదారి పడుతున్న ఆడవాళ్లు భర్త ఉండగా మరో అబ్బాయితో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. నాకొచ్చిన డౌటే అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా' అని వివాహేతర సంబంధం పెట్టుకున్నవారిపై నిప్పులు చెరిగారు.
ఒక భర్త సరిపోడా.. ఎంత మంది కావాలి..
భర్తలను మోసం చేస్తున్న ఆడవాళ్లను మాత్రమే అడుగుతున్నా. మీకు ఒక భర్త సరిపోడా. ఎంత మంది కావాలి. గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో 10 మంది భర్తలను చంపేశారు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ చేసిన భర్తని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చంపేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్ల వల్ల మిగతా ఆడవాళ్లకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరో బయట వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను చంపేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కొద్దిసేపు ఆలోచించండి. మీరు చేసేది తప్పా, ఒప్పా అని. ఎవరి కోసమో భర్తను చంపి. ప్రేమించిన వాడితో వెళ్లిపోవాలని ఆలోచనకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భర్తను చంపి ప్రేమించినవాడితోనైనా సంతోషంగా ఉంటారా. భర్తను చంపితే జైలుకు వెళతారు. మీ ఫ్యామిలీకి, నీకు చెడ్డపేరు వస్తుంది. పాడు పని చేసినందుకు తల ఎత్తుకు తిరుగగలవా? మన దేశంలో ఆడవాళ్లకు ఎంతో విలువుంది. ఆ విలువ మీలాంటి వారి వల్ల పోతోంది.
భర్తను మోసం చేయడం తప్పుకాదా..
మీ కోరికలను తీర్చుకోవడం కోసం. ఇలాంటి పని చేస్తారా. ప్రేమించిన వాడి కోసం భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని బయటకు వెళ్లి చచ్చిపోయిన వాళ్లను చాలామందిని చూశా. మీ భర్తను చంపేస్తున్నావు. నువ్వు జైలుకెళ్లి కూర్చుంటున్నావు. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాన్నను ఎందుకు చంపేశావు అమ్మ అని అడిగితే పిల్లలకు ఏం సమాధానం చెబుతారు. ఈ రోజుల్లో తల్లి అనే పదానికి అర్థం లేకుండా పోతోంది మీలాంటి వారి వల్ల. ఇటీవల ప్రేమికుడితో అసభ్యంగా ఉన్న వీడియోలను భర్తకు పంపించి, ఆయన మరణానికి కారణం అయింది ఓ యువతి. భర్త ఇష్టం లేకపోతే ఎటైనా వెళ్లిపోండి. శరీర సుఖాల కోసం ఎదుటి వారితో ఆడుకోవద్దు. పెళ్లి అయిన అబ్బాయిలు కూడా భార్యల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. కానీ, ఎదుటి వారి జీవితాలతో ఆడుకునేలా ఉండొద్దు.
అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న..
పెళ్లి అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న. పెళ్లి చేసుకొని భర్తనే చంపిన ఆమె, నీకంటే మంచోడు దొరికితే నిన్ను కూడా చంపేయదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఎంత ఆలోచించినా ప్రయేజనం లేదు. ఇకముందు అలాంటి సంఘటనలు జరగకుండా చూద్దాం అంటూ వీడియోలో ఆ యువతి మాట్లాడారు.
సంబంధిత వార్త : ప్రియుడితో భార్య పెళ్లి, భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment