బాధిత బాలికను పరామర్శిస్తున్న అధికారులు
చీరాల: అబల ఇప్పుడు అమ్మకానికి ఆటబొమ్మగా మారింది. బాలికల అక్రమ రవాణా జిల్లా అడ్డాగా మారింది. వలస బతుకులు.. పేదరికం.. కారణంగా ఆడిపాడాల్సిన వయసులో బాలికలు ఆటబొమ్మలుగా మారుతున్నారు. తప్పిపోయిన బాలికల ఆచూకీ కూడా లభించడం లేదు. జిల్లాలో మార్కాపురం గ్రానైట్‌కు అంతర్జాతీయ ఖ్యాతి. చీరాల చేనేతల ఖిల్లా.. కారంచేడు, ఒంగోలు, మేదరమెట్ల సినీనటులకు, కళాకారులకు రాజకీయ వేత్తలకు పేరుగాంచింది. అన్నీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచి ప్రకాశిస్తున్న జిల్లా మానవ అక్రమ రవాణాలో కూడా మొదటి స్థానం పొందిందంటే జిల్లాలో మహిళ, బాలికల అక్రమ రవాణా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చీరాలలో బాలికలు, మహిళల అక్రమ రవాణా, అదృశ్యాలు, లైంగిక దాడులు పెట్రేగి పోతున్నాయంటే క్షీరపురిలో అతివలు, బాలికల పరిస్థితిని అవగతనం చేసుకోవచ్చు. మూడు నెలల క్రితం చీరాల ఎన్‌ఆర్ అండ్ పీఎం హైస్కూల్ ఆవరణలో జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారం, జిల్లా న్యాయసేవాధికార సంస్ద ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణా, మహిళా చట్టాలు, తక్షణ న్యాయ సాయం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారంటే జిల్లాతో పాటు చీరాల్లో బాలికలు, మహిళల అక్రమ రవాణా స్థాయిని అర్థం చేసుకోవచ్చు. చీరాల ప్రాంతంలో తరుచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
జిల్లా కేంద్రం ఒంగోలు తర్వాత పెద్ద పట్టణం చీరాల. వస్త్ర వ్యాపారానికి, చేతివృత్తులు, రోజువారీ కూలీ పనులకు, సుందరమైన సముద్ర తీరానికి వాడరేవు ప్రసిద్ధి. చీరాల పట్టణానికి గుంటూరు, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి ఇక్కడ పనులు చేస్తుంటారు. ఉపాధి అవకాశాల కోసం వలస కూలీలకు అడ్డాగా చీరాల మారింది. మహిళలు, బాలికల అమాయకత్వం, నిరక్షరాస్యతలను ఆసరాగా చేసుకుని డబ్బు ఆశగా చూపించి లోబర్చుకోవడం, కొందరు చీరాల నుంచే మహిళలను ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట మహిళ అదృశ్యం అనే వార్తలు వినిపించేవి. చీరాల్లో మాత్రం ఇటీవల కాలంలో బాలిక, మహిళ అదృశ్యం పరిపాటిగా మారింది. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుస్టేషన్లో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు, బాలికలపై లైంగిక దాడులు అనేకం జరుగుతూనే ఉన్నాయి. 2015లో బాలికపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఓ హోంగార్డు కూడా నిందితుడు కావడం గమనార్హం. పేరాల్లో కూడా బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జె.పంగులూరులో పదేళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా చీరాల సబ్ డివిజన్‌లో లైంగిక దాడులు కేసులు అనేకం ఉన్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
కఠినంగా వ్యవహరిస్తున్నాం: బాలికలు, మహిళలు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. మేలుకొలుపు పేరుతో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వాహనం ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తుఆన్నం. పాఠశాలలు, కళాశాలల్లో బాలికల అక్రమ రవాణాపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. చీరాల సబ్‌డివిజన్ పరిధిలో అక్రమ రవాణా, అదృశ్యం కేసులను చాలావరకు ఛేదించాం. ప్రధానంగా అక్రమ రవాణా చేసేవారితో పాటు అందుకు సహకరించడం, తోడ్పాటు అందించిన వారిపై ఫోక్సా వంటి కేసులు నమోదు చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతను గుర్తెరగాలి. పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. -జి.ప్రేమ్‌కాజల్, డీఎస్పీ, చీరాల
చీరాల ప్రాంతంలో అధికం: జిల్లా వ్యాప్తంగా చీరాలలోనే బాలికలు, మహిళల అక్రమ రవాణా అధికంగా ఉంది. మాతో పాటు కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే అంశాన్ని గుర్తించాయి. కొన్ని సంస్థలు ఇదే విషయంపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు నివేదికలు ఇచ్చాయి. దీని కారణంగా కొద్ది నెలల క్రితం బాలికల అక్రమ రవాణాపై హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో దేశంలో మొదటిసారిగా ప్రత్యేక సదస్సు చీరాలలో నిర్వహించాం. పోలీసు అధికారులతో కలిసి మేము కూడా బాలికల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.- బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment