
మాట్లాడుతున్న ఎస్పీ సర్వశ్రేçష్ట త్రిపాఠి, చిత్రంలో ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ మహబూబ్‌బాషా, స్వాధీనం చేసుకున్న నగలు, వెనుక నిందితులు
కోనేరుసెంటర్(మచిలీపట్నం):మచిలీపట్నం బలరామునిపేటలో దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దొంగతనం చేసినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన నాయుడు లక్ష్మీనారాయణ ఐదేళ్ల క్రితం ఓ మొబైల్ షోరూం పెట్టాడు. ఆ సమయంలో హైదరాబాదుకు చెందిన బాల సాయిసుమ నిజాంపేటలోని తన మేనత్త ఇంటి వద్ద ఉంటూ షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది. కొంతకాలానికి లక్ష్మీనారాయణ, సాయిసుమ మధ్య చనువు పెరిగింది. కొంతకాలానికి సాయిసుమ తిరిగి హైదరాబాదు వెళ్లిపోయింది. మూడు నెలల క్రితం నిజాంపేటలోని మేనత్త ఇంటికి వచ్చింది. పాత పరిచయం మీద ఆమెను లక్ష్మీనారాయణ స్థానిక కేబుల్ కార్యాలయంలో ఆపరేటర్‌గా చేర్పించాడు. దీంతో సాయిసుమ తరచూ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లటం మొదలుపెట్టింది.
డబ్బులు ఇవ్వకపోవడంతో చోరీ..
హైదరాబాదులో విలాసాలకు అలవాటుపడిన సాయిసుమ చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ చేయాలని ఎత్తు వేసింది. అతడి తల్లి లక్ష్మీనరసమ్మతో పరిచయం పెంచుకుంది. లక్ష్మీనరసమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేయాలని పన్నాగం వేసింది. మేనత్త వేర్ల నీలిమ సహకారం తీసుకుంది. లక్ష్మీనరసమ్మ ఒంటిపై ఆభరణాలు అపహరించేందుకు రెండు సార్లు రెక్కీ నిర్వహించింది. విఫలం చెందారు. దీంతో హైదరాబాదులోని సాయిసుమ తమ్ముడిని పిలిపించి అతడి సహకారంతో చోరీకి పాల్పడ్డారు.
లక్ష్మీనారాయణ ఇంట్లో ఉండగానే చోరీ..
ఈ నెల 5వ తేదీ లక్ష్మీనారాయణ గదిలోకి సాయిసుమ వెళ్లి మాటల్లో పెట్టింది. అప్పటికే రెక్కీ నిర్వహిస్తున్న నీలిమ, అతడి మేనల్లుడు కలసి ఇంటి వెనుక నుంచి లక్ష్మీనరసమ్మ గదిలోకి చొరబడి ఆమె మొహంపై హిట్ చల్లారు. స్పృహ కోల్పోగా ఒంటిపై ఉన్న తొమ్మిది నవర్సుల బరువు గల రెండు పేటల గొలుసు, నాలుగు గాజులను అపహరించి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘట నపై లక్ష్మీనారాయణ అదే రోజు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారించి సాయిసుమ, నీలిమలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసినట్లు అంగీకరించటంతో రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. చోరీ కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన సీఐలు రవికుమార్, వాసవి, నభీ, ఎస్‌ఐ లు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు డీఎస్పీ మహబూ బ్‌బాషా, ట్రైనీ డీఎస్పీ రాజ్‌కమల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment