
హత్యకు గురైన ఈశ్వరప్ప, పెళ్లి కొడుకు ఇంటి ముందు బోసిపోయిన పెళ్లి పందిరి
దొడ్డబళ్లాపురం: 15 సంవత్సరాల కూతురికి ఇష్టం లేకున్నా వివాహం నిశ్చయించాడు ఒక తండ్రి. ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పుకుంది ముద్దుల మనవరాలు. ఆమె సంతోషమే తన సంతోషమనుకుని ఆ పెళ్లిని ఆపించాడు తాత. దీంతో తన పరువు తీశావని అగ్రహోదగ్రుడైన బాలిక తండ్రి... తన తండ్రి (తాత)ను కాబోయే వియ్యంకునితో కలిసి దారుణంగా హత్య చేశాడు. సినిమా కథలా అనిపించినా ఇది నిజంగా జరిగిన సంఘటనే. దొడ్డబళ్లాపుర తాలూకా కరేనహళ్లి పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే...
వివరాలు.. కరేనహళ్లి నివాసి కుమార్ (50) తన కూతురు పుష్ప (15)కు, ఇదే ప్రాంత నివాసి సుబ్రమణ్య (55) కుమారుడు బాబుతో వివాహం నిశ్చయించాడు. అయితే ఈ వివాహం పుష్పకు ఇష్టంలేదు. ఇంకా మైనర్ అయిన ఆమె పెద్ద చదువులు చదువుకోవాలనుకుంది. కుటుంబ సభ్యులకు కూడా ఈ వివాహం ఇష్టంలేదు. తండ్రి తన బాధను పట్టించుకోకపోవడంతో తాత ఈశ్వరప్ప(70)తో తన గోడు చెప్పుకుంది. మనవరాలి దుఃఖం చూడలేని తాత రంగంలోకి దిగాడు. మహిళా–శిశు అభివృద్ధి శాఖ అధికారులకు ఫోన్ చేసి మైనర్ బాలికకు సోమవారం వివాహం జరుగుతోందని, కావున తక్షణం వివాహం నిలపాలని కోరాడు. అధికారులు నేరుగా కరేనహళ్లికి వెళ్లి వివాహం ఎట్టిపరిస్థితుల్లో జరగరాదని, జరిపితే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఘాటిపుణ్యక్షేత్రంలో సోమవారం జరపాల్సిన వివాహం ఆగిపోయింది.
తనయుడు గొడవ పడి...
పెళ్లి ఆగిపోవడం, బంధువుల్లో చులకన కావడం అవమానంగా భావించిన తండ్రి కుమార్, పెళ్లికొడుకు తండ్రి సుబ్రమణ్య ఇద్దరూ మద్యం తాగి ఆదివారం రాత్రి ఈశ్వరప్ప ఇంటికివెళ్లి ఘర్షణపడ్డారు. ఆగ్రహం పట్టలేక బండరాయితో తలపై మోది పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధున్ని ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. వెంటనే నిందితులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లు వదిలి పరారయ్యారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment