మనవడి దాడిలో గాయపడిన పీకమ్మ
అసలే పండుటాకు. వృద్ధాప్యం తెచ్చిన అనారోగ్య సమస్యలకు పింఛను డబ్బులే ఆమెకు ఆధారం. అయితే, మూడు నెలలుగా ఆమెకు తెలియకుండా పింఛను కాజేశాడో ప్రబుద్ధుడు. దీనిపై ప్రశ్నించినందుకు ఏకంగా ఆమెను చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకూ ఆ ప్రబుద్ధుడెవరో కాదు..సాక్షాత్తు ఆమె మనవడే.!! ఈ సంఘటన బొమ్మనచెరువు తాండాలో చోటుచేసుకుంది.
చిత్తూరు, మదనపల్లె టౌన్ : మండలంలోని బొమ్మనచెరువు తాండాకు చెందిన పెద్దిరెడ్డెప్ప నాయక్ భార్య పీకమ్మ(80)కు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ ఇస్తోంది. ఈ సొమ్మును మూడు నెలలుగా ఆమె మనవడు గణేంద్రనాయక్ (22) కాజేస్తూ వస్తున్నాడు. ఇది ఆమెకు తెలియదు. తనకు పింఛను అందకపోవడంపై పీకమ్మ కార్యదర్శిని నిలదీసింది. నీ మనవడే తీసుకెళ్తున్నాడని కార్యదర్శి చెప్పడంతో ఆమె మనవడిని నిలదీసింది. ఆగ్రహించిన అతడు ‘అన్నం పెడుతున్నాం కదా!.. డబ్బులు నీకెందుకు?’ అంటూ ఎదురుతిరిగాడు. ఆమె దూషించడంతో కర్రతో చితకబాది తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment