మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు
అచ్చంపేట (పెదకూరపాడు): కోళ్లు దొంగిలించాడంటూ ఓ దివ్యాంగుడిపై అక్రమ కేసు బనాయించి గత 15 రోజులుగా రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించడంతో అవమానం భరించలేక ఆ అభాగ్యుడు ఉరేసుకున్నాడు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరులో ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కొండూరుకు చెందిన దివ్యాంగుడు చొప్పరపు బాలయ్య (27)పై గ్రామానికి చెందిన సర్పంచ్ వర్గీయులు పులి తిరుపతిరాజు, పులి గురవరావు, వీరరాజు అనే వ్యక్తులు తమకు చెందిన 10 కోళ్లను దొంగిలించాడంటూ 15 రోజుల క్రితం అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా రోజూ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు.
గ్రామంలోనే పరిష్కరించుకోవాలని సూచించడంతో.. 10 కోళ్లు దొంగిలించినందుకు బాలయ్య రూ.లక్ష చెల్లించాలని పంచాయితీలో పెద్దలు తీర్పు ఇచ్చారు. దీంతో బాలయ్య తీవ్ర మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య మృతికి సర్పంచ్, అతని వర్గీయులు, అచ్చంపేట ఎస్‌ఐ కిరణ్ కారణమంటూ భార్య నాగమ్మ, అక్క అంకాళమ్మ, వదిన శివరావమ్మ ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహరనాయుడు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment