బాధితురాలి వివరాలు వెల్లడించడంపై మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం పట్ల మీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన కేసులో బాధితురాలి వివరాలను వెల్లడించిన పలు మీడియా సంస్థలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ సుమోటోగా ఈ అంశాన్ని చేపట్టి ఆయా మీడియా సంస్థల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తమపై ఎందుకు చర్యలు చేపట్టరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీప గ్రామం రసానా నుంచి బకేర్వాల్ ముస్లిం వర్గానికి చెందిన బాలిక అదృశ్యమైంది. వారం రోజుల అనంతరం అక్కడికి దగ్గర్లోని అడవుల్లో శవమై తేలింది. ఆమెపై నిందితులు సామూహిక లైంగిక దాడికి తెగబడి, అనంతరం దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు నిందితులపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అభియోగాలు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment