సాక్షి, చెన్నై: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన దారుణమైన పరువు హత్య ఘటనను మరువకముందే తమిళనాడులో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ యువజంట ప్రేమకు కులం అడ్డుగా నిలిచింది. తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తూ.. ఆ అమ్మాయిని తరచూ కలుస్తుండటంతో అబ్బాయి సోదరుడు ఇక్కడ విలన్ అయ్యాడు. తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తావా? అంటూ ఇద్దరిపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకున్న ఈ పరువుహత్య సంచలనం రేపుతోంది.
కోయంబత్తూరు మెట్టుపాలయం శ్రీరంగరాయన్ ఓట్టై ప్రాంతానికి చెందిన కరుప్పసామి కుమారుడు కనకరాజ్ (22) అదే ప్రాంతంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో దర్శినిప్రియ(17)తో అతనికి పరిచయమై.. ప్రేమగా మారింది. అయితే, ఇరువురి సామాజిక వర్గాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే వారిని వెతికి పట్టుకున్న ఇరుకుటుంబాల పెద్దలు.. పంచాయతీ పెట్టి.. వేరు చేశారు. ఇకపై ఒకరినొకరు కలవకూడదని షరతులు పెట్టారు.
అయినా, ఆ తర్వాత కూడా కనకరాజ్, దర్శినిప్రియ తరచూ కలుస్తూ వచ్చారు. దర్శినిప్రియది దళిత సామాజిక వర్గం అని తెలుస్తోంది. అమ్మాయి తక్కువ కులానికి చెందినదని, ఆ అమ్మాయిని కలువకూడదని కనకరాజ్‌ను అతని సోదరుడు వినోద్ హెచ్చరించాడు. అయినా వారు రహస్యంగా కలుస్తూ వస్తుండటంతో ఆగ్రహించిన వినోద్.. గత మంగళవారం సోదరుడు కనకరాజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి అడ్డువచ్చిన దర్శినిప్రియపై కూడా కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో కనకరాజ్ అక్కడికక్కడే మృతిచెందగా దర్శినిప్రియ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది.
Comments
Please login to add a commentAdd a comment