రోదిస్తున్న కుటుంబ సభ్యులు కూలిన ఇంటి పైకప్పు ,సాత్విక మృతదేహం
మరో గంటలో నిద్రలేవాల్సిన ఆ చిన్నారి శాశ్వత నిద్రలోకి వెళ్లింది. మూడేళ్లకే మృత్యువు కబళించుకుపోయింది. ఇంటి పైకప్పే ఆ చిన్నారిపాలిట యమపాశమైంది. నిద్రిస్తున్న చిన్నారిపై విరిగి పడడంతో నిద్రలోనే మృతిచెందింది. ఈ సంఘటన ధర్మపురిలో గురువారం జరిగింది.
ధర్మపురి: ఉదయం తెల్లవారుతోంది. మరో అరగంటలో అమ్మా అంటూ ఆ చిన్నారి తల్లి ఒడికి చేరేది. ఇంతలోనే ఘోరం జరిగింది. ఇంటి పైకప్పు కూలి ఆ చిన్నారి నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన ధర్మపురిలో గురువారం జరిగింది. చిన్నారి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ధర్మపురికి చెందిన చిటన్నోజ్ వెంకన్న ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తుంటాడు. వచ్చేజీతం తిండి, బట్టకు సరిపోవడంతో ఏళ్లకాలంగా పురాతన ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఒకగదిలో వెంకన్న దంపతులు, మరో గదిలో తన కొడుకు లింగస్వామి అతడి భార్య పావని పిల్లలు లోకేష్ (5), సాత్విక (3)తో ఉంటున్నారు. రెండేళ్లక్రితం లింగస్వామి ఉపాధినిమిత్తం సింగపూర్ వెళ్లాడు. పావని పిల్లలతో అదే గదిలో ఉంటోంది.
ఇదీ జరిగింది..
రోజూలాగే బుధవారం రాత్రి పావని పిల్లలతో తన గదిలో నిద్రించింది. గురువారం ఆరు గంటలకు నిద్రలేచి బయటకు వచ్చింది. ఇంతలో భారీ శబ్ధంతో వారుంటున్న గది పైకప్పు కూలింది. పావని లబోదిబోమంటూ స్థానికులను పిలుచుకొచ్చింది. అప్పటికే బెడ్‌పై పడుకున్న సాత్విక, లోకేశ్ మట్టిలో కూరుకుపోయారు. ఎలాగోలా ఇద్దరిని బయటకు తీశారు. లోకేశ్ దుప్పటి కప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. సాత్విక పూర్తిగా మట్టిలో కూరుకుపోవడంతో శ్వాస ఆడలేదు. వెంటనే జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్య లో మృతిచెందింది. దీంతో చేసేదేమీ లేక సాత్విక మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.
వారం రోజుల్లో తండ్రి ఇంటికి..
సింగాపూర్ వెళ్లిన లింగస్వామి మరో వారం రోజుల్లో ఇంటికి వచ్చేవాడు. తండ్రి రాకకోసం పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సాత్విక ప్రమాదవశాత్తు మృతిచెందింది. విషయం తెలుసుకున్న లింగస్వామి సింగపూర్‌నుంచి బయల్దేరాడు. నేడు స్వగ్రామానికి చేరుకోనున్నాడు. ఆర్‌ఐ రంగారావు పంచనామా చేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment