నిందితుడు వెంకటఅప్పన్నదొరతో సీఐ శ్రీనివాసరావు,ఎస్‌ఐ మల్లేశ్వరరావు
చోడవరం: చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) హత్య కేసులో ఆమె భర్త బైన వెంకటఅప్పన్నదొరను పోలీసులు అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ ఎం. శ్రీనివాసరరావు విలేకరులకు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) ఈనెల 15వతేదీ అర్ధరాత్రి హత్యకు గురైంది. సుజాతపై రెండేళ్లుగా అనుమానంతో ఉన్న భర్త వెంకటఅప్పన్నదొర మూడునెలలుగా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15వతేదీ అర్ధరాత్రి భార్య,భర్తల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో అక్కడే ఉన్న మంచం కోడుతో భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడు అప్పన్నదొర ఆ గ్రామ వీఆర్‌వో సుమలత ఎదుట సోమవారం లొంగిపోయాడు. ఆమె తమకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. కోర్టుకు తరలించామని చెప్పారు. ఈ సమావేశంలో చోడవరం ఎస్‌ఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఇదిలావుండగా సుజాత, అప్పన్నదొరకు 11యేళ్ల కిందట వివాహం జరిగింది. ఐదో తరగతి, ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటు తల్లిని కోల్పోయి, అటు తండ్రి జైలుకి వెళ్లడంతో వారిద్దరూ అనాథలుగా మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment