సాక్షి ప్రతినిధి, చెన్నై: నాతి చరామీ అంటూ కష్టసుఖాల్లో నూరేళ్లు కలిసి నడుస్తామని పెద్దల సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన భర్తలు కాలయముళ్లుగా మారిపోయారు. భార్య, అత్తను హత్యచేసి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో కేసులో సైతం భర్త చేతిలో భార్య బలైన సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి.
కోయంబత్తూరు పోత్తనూరుకు చెందిన బాబు (46) అనే భవన నిర్మాణ కార్మికునికి సుమతి (42)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానలేమి వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో సుమతి రెండేళ్ల క్రితం భర్తను వదిలి పొల్లాచ్చిలోని తన తల్లి విశాలక్ష్మి (60) వద్ద ఉంటోంది. ఈ రెండేళ్లలో భర్త తరచూ తాగి వచ్చి ఘర్షణ పడడాన్ని భరించలేక విడాకులు కోరుతూ మూడునెలల క్రితం సుమతి నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో పాటు సుమతితో కలసి జీవించాలని ఆశపడుతున్నాడు. కాగా, మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మరలా అత్తవారింటికి వచ్చి అత్త విశాలాక్షిని కత్తితో గొంతుకోసి హతమార్చాడు. తల్లి కేకలు విని మరో గది నుంచి బయటకు వచ్చిన భార్య సుమతిని కిందపడేసి ఆమె గొంతు కూడా కత్తితో కోసి కడతేర్చాడు. ఇద్దరు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత బాబు సైతం అదే ఇంటిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో వేరుగా ఉంటున్న విశాలాక్షి కుమారుడు బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చెల్లి, తల్లి శవాలై, మరో గదిలో ఉరికి వేలాడుతూ బావ బాబు కనిపించారు. పొల్లాచ్చి తూర్పు విభాగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై సైదాపేటకి చెందిన కార్తిక్, భార్య సౌమ్య మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. బుధవారం ఆగ్రహాన్ని తట్టుకోలేని కార్తిక్ కత్తితో భార్య గొంతుకోసి హత్యచేశాడు. ఆ తరువాత అదే కత్తితో తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగూపొరుగూ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్తిక్‌ను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్దు చేస్తున్నారు.
చెన్నై రామాపురానికి చెందిన రాజన్, ధరణిలకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ చెన్నైలోని పాత్రల కంపెనీలో పనిచేస్తున్నారు. రాజన్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. మంగళవారం రాత్రి యథావిధిగా రాజన్ తాగి ఇంటికి రావడంతో కోపగించుకున్న ధరణి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని బెదిరించింది. అయితే ఇందుకు మరింత ఆగ్రహించిన రాజన్ ఆమెకు నిప్పంటించాడు. మంటల బాధను తట్టుకోలేక కేకలు పెడుతున్న ధరణిని ఇరుగూపొరుగూ కాపాడి చెన్నై కీల్‌పాక్ ఆస్పత్రిలో చేర్పించగా విషమపరిస్థితిలో చికిత్స పొందుతోంది. భర్త పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment