
తమిళనాడు, టీ.నగర్: ప్రభుత్వం వివాహ కానుకగా అందజేసిన ఒక సవరం బంగారు నాణెం కోసం గర్భిణిగా ఉన్న భార్యను హత్య చేసి కేసు నుంచి తప్పిచుకునేందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. సేలం జిల్లా, జలకంఠాపురం సమీపానగల కరిక్కాపట్టి గ్రామం, ఆండికాడు ప్రాంతానికి చెందిన చంద్రన్ కుమార్తె భువనేశ్వరి (21). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజవేల్ (22)తో ఏడాది కిందట వివాహం జరిగింది.
ప్రస్తుతం భువనేశ్వరి మూడు నెలల గర్భవతి. ఈ నెల 19న భువనేశ్వరికి ప్రభుత్వం తరఫున వివాహ ఆర్థికసాయం కింద ఇచ్చిన ఒక సవరం బంగారు నాణెన్ని తన తల్లి సంధ్య వద్ద ఉంచింది. ఈ క్రమంలో 20వ తేదీన భువనేశ్వరి తండ్రి చంద్రన్ కొత్తగా బైక్ కొన్నాడు. అతడు బంగారు నాణెన్ని విక్రయించి బైక్ కొన్నట్లుగా భర్త రాజవేల్ అనుమానించి భువనేశ్వరిని బంగారు నాణెం ఇవ్వమని కోరాడు. దీంతో వారి మధ్య తగాదా ఏర్పడింది. ఆగ్రహించిన రాజవేలు భువనేశ్వరిని కిందికి తోసేయడంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. తర్వాత దిండుతో ఆమె ముఖాన్ని అదిమిపట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయం దాచేందుకు ఇరుగుపొరుగు, బంధువుల వద్ద్ద భువనేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడిన రాజవేలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. దీన్ని అనుమానించిన భువనేశ్వరి తల్లి సంధ్య జలకంఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భువనేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె హత్యకు గురైనట్లు తెలియడంతో పోలీసులు రాజవేలును అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment