అనుమానంతో భార్యను చంపిన భర్త | Husband Killed Wife In Hyderabad | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Published Wed, Sep 12 2018 7:39 AM | Last Updated on Wed, Sep 12 2018 7:39 AM

Husband Killed Wife In Hyderabad - Sakshi

హత్యకు గురైన జ్యోత్స్న , నిందితుడు ప్రశాంత్‌

బంజారాహిల్స్‌: ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన ఉదంతం మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని కంకిపాడు మండలం వల్లూరిపాలెం గ్రామానికి చెందిన మల్లవల్ల ప్రశాంత్‌బాబు(40), మచిలీపట్నం శారదానగర్‌కు చెందిన వేమురి జ్యోత్స్న (31) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రశాంత్‌బాబు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంలో ఉంటున్న  వీరిద్దరు విభేదాలతో కారణంగా తొమ్మిది నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోత్స్న ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ప్రశాంత్‌బాబు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భర్తతో గొడవపడి జ్యోత్స్న తన పుట్టింటికి వెళ్లిపోయింది.

గత శుక్రవారం తనకు ఆర్టీసీలో ఉద్యోగం వస్తోందని రూ.80 వేలు కావాలంటూ జ్యోత్స్న తన భర్త ప్రశాంత్‌ వద్దకు వచ్చింది. ఇద్దరం కలిసి సామరస్యంగా మాట్లాడుకొని కాపురం చేద్దామంటూ సోమవారం రాత్రి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ప్రశాంత్‌ తమ్ముడు ప్రకాశ్‌ ఇంటికి వచ్చాడు. ప్రకాశ్‌ రోడ్‌ నెం.10లోని హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశాంత్‌ డ్రైవింగ్‌కు వెళ్లిపోగా ఆయన భార్య యజమాని ఇంట్లో పనికి వెళ్లింది. ఆ సమయంలో జ్యోత్స్న ప్రశాంత్‌ మళ్లీ గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడే ఉన్న రోకలిబండ తీసుకొని జ్యోత్స్న తలపై గట్టిగా కొట్టడంతో ఆమె కుప్పకూలింది.

ఆమె ప్రాణాలు ఇంకా ఉన్నాయని తెలుసుకొని పక్కనే ఉన్న రుబ్బురోలుతో తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆరా తీయగా తాము సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సులో హైదరాబాద్‌ వచ్చి తన బాబాయ్‌ కొడుకు ప్రకాశ్‌ గదికి చేరుకున్నామని, ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపం పట్టలేక రుబ్బురోలుతో తలపై బాదినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement