మైసూరు: ఏరికోరి వ్యవసాయదారుడిని వివాహం చేసుకున్న పట్టభద్రురాలు(ఎంటెక్) చివరకు భర్త చేతిలోనే హతమైంది. అత్తమామలు కారు కొనివ్వలేదని భార్యపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన మైసూరు జిల్లా హుణుసూరు తాలూకాలో చోటుచేసుకుంది. హెచ్.డి.కోటె తాలుకాకు చెందిన నరసింహగౌడ కుమర్తె ఎంటెక్ చేసింది. వ్యవసాయం చేసే రైతునే వివాహం చేసుకుంటానని కూతురు పట్టుబట్టడంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.
కుమార్తె ఇష్టం మేరకు గత ఏడాది హుణుసూరులోని రంగయ్యన కొప్పళ్లు గ్రామానికి చెందిన రాఘవేంద్రతో తేజస్వినికి వివాహం చేశారు. కట్నకానుకలు కింద సుమారుగా రూ. 20 లక్షలు ఇచ్చారు. వివాహమైన కొద్దిరోజుల వరకు వారి దాంపత్యం జీవితం ఆనందంగానే జరిగింది. అయితే కొంతకాలం తర్వాత రాఘవేంద్రలో కోరికల చిట్టా బుసలు కొట్టింది. పుట్టింటికి వెళ్లి కారు కొని తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తేవటం మొదలుపెట్టాడు.
దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం కూడా కారు కోసం తేజస్వినితో గొడవ పడ్డాడు. అతని కోర్కెను ఆమె తిరస్కరించడంతో కోపంతో మరణాయుధంతో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ తేజస్వినిని మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందతూ మృతి చెందింది. అత్తమామలకు అతను ఫోన్ చేసి తేజస్విని కిందపడి మృతి చెందిదని సమాచారం ఇచ్చి పారిపోయాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జయలక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment