
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : వారాంతం కావడంతో మందుబాబులకు చెక్‌పెట్టేందుకు నగర పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 76 కేసులు నమోదు చేయగా.. 32 కార్లు, 44 బైకులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి మాత్రం నానా హంగామా సృష్టించింది.
యువతి రాష్ డ్రైవింగ్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ యువతి హ్యుందయ్ క్రెట కారులో (టీఎస్ 09 ఈయూ 9450) అటుగా వచ్చింది. బ్రీత్ ఎనలైజర్‌తో మద్యం సేవించిందో లేదో తనిఖీచేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా డ్రైవింగ్ చేస్తూ పరారయ్యేందుకు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అవటంతో సదరు యువతి పోలీసులకు దొరికిపోయింది. మద్యం సేవించిందేమోననే ఉద్దేశంతో మరోసారి తనిఖీ చేయగా ఆల్కాహాల్ శాతం జీరో వచ్చింది. దీంతో యువతి పైన రాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసి కారును సీజ్ చేశారు.
బీభత్సం సృష్టించిన కారు : బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ వైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న కారు మసీదు మలుపు వద్ద అతివేగంతో దూసుకొచ్చింది. భయాందోళనకు గురైన వాహనదారులు, బాటసారులు ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. కారు రోడ్డు మధ్య నున్న డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు తుక్కుతుక్కైంది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment