
హైదరాబాద్: పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం తుపాకీ కాల్పులు కలకలం రేపిన సంగతి తెల్సిందే. పంజాగుట్ట కాల్పుల ఘటపై ఆర్టీసీ బస్సు కండక్టర్ భూపతి స్పందించారు. కాల్పుల ఘటనపై పోలీసులకు కండక్టర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఘటనపై భూపతి మాట్లాడుతూ..కాల్పులు జరిపినపుడు ఆగంతుకుడు డోర్ వద్ద నిలబడి ఉన్నాడని చెప్పారు. లోపల టికెట్ కలెక్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చిందని, దీంతో ప్రయాణికులతో పాటు తాము కూడా భయాందోళనకు గురయ్యామని చెప్పారు.
పంజాగుట్ట సర్కిల్ దాటిన తర్వాత ఆగంతకుడు బస్సు దిగి వెళ్లిపోయాడని వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే తాము ఆర్టీసీ ఉన్నతాధికారుకులకు సమాచారం అందించామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచక బస్సును డిపోకు తీసుకెళ్లిపోయామని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తుపడతానని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో బస్సులో 30 మంది పైనే ప్రయాణికులు ఉన్నారని వివరించారు.
నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ
ఆర్టీసీ బస్సులో కాల్పులు గురువారం ఉదయం పదిన్నర నుంచి 11 గంటల మధ్య జరిగిందని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు. ఫుట్‌బోర్డు వద్ద ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగిందని, కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.