వివాహేతర సంబంధం.. చెన్నై వ్యక్తి ఆంధ్రలో శవం | Illegal Affair Chennai Man Dead Body In Andhra | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published Sun, Jan 5 2020 9:27 AM | Last Updated on Sun, Jan 5 2020 9:33 AM

Illegal Affair Chennai Man Dead Body In Andhra - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అనకాపుత్తూరులో అదృశ్యమైన ఎల్రక్టీషియన్‌ ఆంధ్రలో శవంగా కనిపించాడు. వివాహేతర సంబంధంతో అతన్ని ఆంధ్రకు రప్పించి హత్యచేసిన జంటను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి విచారణ జరిపేందుకు నిర్ణయించారు. పల్లావరం సమీపానగల అనకాపుత్తూరు లేబర్‌పల్లి ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ (42) ఎల్రక్టీషియన్‌. ఇతను గత డిసెంబర్‌ 18న ఇంటి నుంచి బయటికి వెళ్లి ఆ తర్వాత తిరిగిరాలేదు. కుటుంబీకులు శంకర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తూ వచ్చారు. అతని సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా విచారణ జరపగా ఆంధ్ర రాష్ట్రం, చిత్తూరు జిల్లా ఎస్‌సీ కాలనీ రెండో వీధికి చెందిన శివకుమార్‌ (38)తో చివరిగా ఎక్కువసార్లు మాట్లాడినట్లు తెలిసింది. శివకుమార్, అతని భార్య మాదేశ్వరిని శంకర్‌నగర్‌కు రప్పించి పోలీసులు విచారణ జరిపారు.

పోలీసులతో మాట్లాడిన శివకుమార్‌ కార్తికేయన్‌ తనకు ఎవరనే విషయం తెలియదని వెల్లడించారు. అతని భార్య మాదేశ్వరిని పోలీసులు విడిగా విచారణ జరపగా పొంతన లేని సమాధానాలు తెలిపారు. అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో ఆమె వద్ద విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. అనకాపుత్తూరులో కార్తికేయన్‌ ఇంటి సమీపాన శివకుమార్‌ సోదరుడు నివసిస్తున్నారు. అతని ఇంటికి మూడు నెలల క్రితం శివకుమార్, అతని భార్య మాదేశ్వరి విందుకు వచ్చారు. ఆ సమయంలో పక్కింటి వ్యక్తి అయిన కార్తికేయన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీన్ని కార్తికేయన్‌ తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. వారం తర్వాత శివకుమార్‌ దంపతులు మళ్లీ ఆంధ్రకు వెళ్లారు.

ఇలావుండగా మాదేశ్వరితో ఫోన్‌లో సంప్రదించిన కార్తికేయన్‌ తరచూ అక్కడికి వచ్చి తన కోర్కె తీర్చాలని, లేకుంటే తమ అసభ్య ఫొటోను నెట్‌లో విడుదల చేస్తానని బెదిరించాడు. భీతి చెందిన మాదేశ్వరి ఈ విషయం తన భర్త శివకుమార్‌కు తెలిపింది. ఆగ్రహించిన శివకుమార్‌ భార్య మాదేశ్వరి ద్వారా కార్తికేయన్‌ను ఆంధ్రకు రప్పించి హత్యచేసి సమీపానగల ఖాళీ స్థలంలో పాతిపెట్టారు. దీంతో ఇరువురినీ అరెస్టు చేసిన పోలీసులు కార్తికేయన్‌ మృతదేహం వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పమ్మల్‌ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement