
లండన్: చేసేది పవిత్ర వైద్యవృత్తి... కానీ అతడి బుద్ధి మాత్రం నీచమైనది. వైద్యం కోసం తన దగ్గరికి వచ్చే మహిళలను లైంగికంగా వేధించి వికృతంగా ప్రవర్తించాడు. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో.. అందరి ముందు దోషిగా నిలబడ్డాడు. వివరాలు... భారత్‌కు చెందిన మనీష్ షా అనే డాక్టర్ లండన్‌లో స్థిరపడ్డాడు. జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న అతడి వద్దకు ఎంతో మంది మహిళలు వస్తుండేవారు. ఈ క్రమంలో సాధారణ చెకప్ కోసం వచ్చిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి వివరించేవాడు. వ్యాధుల తీవ్రతను చెబుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఎలాగైనా పరీక్షలు చేయించుకునేలా వారిని ఒప్పించేవాడు. ఈ క్రమంలో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక దాడికి పాల్పడేవాడు. అలా 2009 నుంచి 2013 వరకు దాదాపు 23 మంది మహిళలను, మరికొంత మంది బాలికలను వేధించాడు.
ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2013లో వైద్యశాఖ ఉన్నతాధికారులు మెడికల్ ప్రాక్టీసు నుంచి అతడిని సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన కేసు మాత్రం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం మనీష్ షా కేసు కోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ‘ హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్తపడ్డారు. కాబట్టి మీరు తప్పక పరీక్షలు చేయించుకోవాలి అంటూ తన దగ్గరికి వచ్చిన మహిళా పేషెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనీష్ తీరును కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో అతడిని దోషిగా తేల్చిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. ఇక షా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించాడు. తనకు ఏ పాపం తెలియదని పేర్కొన్నాడు.