ఐదో తరగతి వరకు చదివి... | Inter District Thief Suresh Arrest | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్ట్‌

Published Thu, Apr 12 2018 2:31 PM | Last Updated on Thu, Apr 12 2018 2:31 PM

Inter District Thief Suresh Arrest - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి (సర్కిల్‌లో) నిందితుడు సూరయ్య

మహబూబాబాద్‌ రూరల్‌: అంతర్‌ జిల్లా నేరస్తుడు అంగడి సూరయ్య అలియాస్‌ సురేష్‌ను అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి 36 తులాల బంగారు, 26 తులాల వెండి ఆభరణాలు (రూ. 10 లక్షల సొత్తు) స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ ఎస్‌.ఏ జబ్బార్, సీసీఎస్‌ సీఐ బి. శ్రీనివాసులు, ఎస్సై జి. స్వామిదాస్, సిబ్బంది వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారులో తనిఖీలు చేపట్టారన్నారు.

అంతర్‌ జిల్లా నేరస్తుడైన, జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ అంగడి సూరయ్య అలియాస్‌ సురేష్‌ తన ద్విచక్ర వాహనంపై తొర్రూరు వైపు నుంచి మహబూబాబాద్‌కు వస్తున్నాడు. తొర్రూరు బస్టాండ్‌ సమీపంలో పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. సురేష్‌ను విచారించగా మహబూబాబాద్, డోర్నకల్, బయ్యారం, గూడూరు, తొర్రూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట ప్రాంతాల్లో దొంగతనాలు చేసి సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి, వాటిని మహబూబాబాద్‌ పట్టణంలో రహస్యంగా అమ్మేందుకు వచ్చాడని చెప్పాడన్నారు. తాను చేసిన నేరాలన్ని అంగీకరించాడని, అతడి వద్ద నుంచి 36 తులాల బంగారు, 26 తులాల వెండి ఆభరణాలు (రూ. 10 లక్షల సొత్తు) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మోటర్‌ సైకిల్‌కు కూడా పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..
అంగడి సురేష్‌ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, ఆ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసేవాడని, అదే విధంగా ఇంట్లో నిద్రిస్తున్న వారి మెడలో ఉన్న పుస్తెలను లాక్కు పోవడం చేసేవాడన్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలకు పాల్పడే వాడని, కూతాటి రమేష్, అంగడి జంపయ్యతో కలిసి కూడా చోరీలకు పాల్పడ్డారన్నారు. ఇతడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 120 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడన్నారు. సురేష్‌ చేసిన నేరాల్లో మహబూబాబాద్‌ పట్టణంలో 4, బయ్యారంలో 3, డోర్నకల్‌లో 1, గూడూరులో 1, తొర్రూర్‌లో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో 1,  నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 3, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేటలో 1 కేసు ఉన్నాయన్నారు.

ఐదో తరగతి వరకు చదివి...
చదువుమానేసి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ తద్వారా వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడని తెలిపారు. 2010లో మహబూబాబాద్‌ పట్టణంలో దొంగతనాలు చేసి పట్టుబడి జైలు జీవితం అనుభవించాడని, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల్లో, నల్లొండ, కేసముద్రం పోలీసులకు పట్టుబడి జైలు జీవితాన్ని గడిపి వచ్చాడన్నారు. మళ్లీ మహబూబాబాద్‌ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుండగా అతడిపై నిఘా పెట్టి పట్టణంలో పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు.

రివార్డు అందజేత
సురేష్‌ను చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు కృషి చేసిన డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్, రికవరీ చేసిన సీసీఎస్‌ సీఐ బి. శ్రీనివాసులు, ఎస్సై జి. స్వామిదాసు, టౌన్‌ సీఐ షేక్‌ అబ్ధుల్‌ జబ్బార్, సీసీఎస్‌ హెచ్‌సీ ఇనాయత్‌అలీ, పీసీలు వేణుగోపాల్, ఇస్తారీ, రఘురామ్‌ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డును అందజేశారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ కె. తిరుపతి, ఐటీ కోర్‌ సీఐ శ్యాంసుందర్, ట్రాఫిక్‌ ఎస్సై ఎస్‌. అశోక్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement