వెంకటలక్ష్మి(ఫైల్) , నిందితుడు సాగర్
బంజారాహిల్స్ : జవహర్‌నగర్‌లో జరిగిన యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె ప్రియుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం గ్రామానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి(19) ఏడాది క్రితం మధురానగర్‌లోని ఓ ఇంట్లో పని చేసేది. అదే ఇంటిపై ఉంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ మాజీ డీసీపీ రంగనాథ్ (ప్రస్తుతం నల్లగొండ ఎస్పీ) ఇంట్లో ఖమ్మంకు చెందిన మిడికొండ సాగర్(24) అనే హోంగార్డు డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో ఇద్దరు కలిసి తిరిగారు.
అయితే కులాలు వేరుకావడంతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఏడాది క్రితం అక్కడ పనిమానేసిన వెంకటలక్ష్మి జవహర్‌నగర్‌లోని జోడి వన్‌గ్రామ్ గోల్డ్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరింది. అప్పటి నుంచి సాగర్‌ను దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న సాగర్ రెండు, మూడుసార్లు దుకాణానికి వస్తున్న ఆమెను అడ్డుకుని ఘర్షణ పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కూడా మందలించినా సాగర్ వైఖరిలో మార్పు రాలేదు. ఐదు రోజుల క్రితం వెంకటలక్ష్మి మరో యువకుడితో బైక్‌పై వెళుతుండటాన్ని చూసిన సాగర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బ్లేడ్ కొనుక్కొని వెంకటలక్ష్మి పని చేస్తున్న స్టోర్‌కు వచ్చి తనను ఎందుకు దూరం పెడుతున్నావని నిలదీశాడు. దీంతో ఆమె తన యజమానికి ఫోన్ చేసి సాగర్ తనతో గొడవపడుతున్నట్లు చెప్పడంతో పోలీసులు వస్తారేమోనన్న భయంతో సాగర్ బ్లేడ్‌తో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న వెంకటలక్ష్మి ఇంకా చనిపోలేదని గుర్తించి చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎస్పీ రంగనాథ్ ఇంటికి వెళ్లి డ్యూటీలో చేరిపోయాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ద్వారా సాగర్ వివరాలు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment