హోషియార్‌పూర్/కొట్టాయం: నన్‌పై రేప్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలి మద్దతు దారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జలంధర్ బిషప్‌గా ఉన్న కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నన్ ఒకరు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) హోషియార్‌పూర్ సమీపంలోని దసుయ చర్చి ఆవరణలోని తన గదిలో సోమవారం అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. ‘గదిలో వాంతులు చేసుకున్న ఆనవాళ్లున్నాయి. వాటిని ల్యాబ్‌కు పంపాం. ఫాదర్ కట్టుత్తరా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు’అని డీఎస్పీ ఏఆర్ శర్మ తెలి పారు. ఫాదర్ కట్టుత్తరా పదిహేను రోజుల క్రితమే భోగ్‌పూ ర్ చర్చి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు చర్చి సిబ్బంది తెలిపారు. బిషప్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన ఫాదర్ కట్టుత్తరా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతుండేవారని ఆయన బంధువులు తెలిపారని డీఎస్పీ వెల్లడించారు. కొట్టాయంలోని కురవిలంగడ్ కాన్వెం ట్‌లో బాధిత నన్‌తోపాటు ఉంటున్న మరో ఐదుగురు నన్‌లు తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిషప్ ములక్కల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఫాదర్ కట్టుత్తరా మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. ముల క్కల్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేసిన వారికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment