గార్ల: పేకాట స్థావరంపై పోలీసులు దాడులు జరిపి 15 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.23 లక్షల నగదు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఘటన మానుకోట జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామ పంచాయతీ పరిధిలోని కనకమ్మతండాలో చోటు చేసుకుంది. బయ్యారం సీఐ రమేశ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా, ఇల్లెందు, డోర్నకల్, గార్ల మండలాలకు చెందిన వ్యక్తులు కొంతకాలంగా అడ్డాలు మారుస్తూ ఈ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. మంగళవారం గార్ల మండలం కనకమ్మతండాలోని ఓ ఇంట్లో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
పేకాట ఆడుతున్న కావిటి నాగరాజు, కునారపు సురేశ్, కత్తుల నరేశ్, బానోత్ పాండుకుమార్, బొడ్ల వసంతరావు, చెరుకూరి శ్రీనివాస్, బచ్చల ఉమేశ్, వి.అంజిరావు, జి.రమేశ్, ఆకుల అర్జున్, వీరబోయిన భద్రం, కర్నేటి రామారావు, మెరుగు వెంకటేశ్వర్లు, పోటు రాములు, ఉమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,23,000 నగదు, 11 సెల్ ఫోన్లు, 5 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇల్లెందు కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది వీరబాబు, గోపాల్, రవి, రమేశ్, కిషన్‌కు మానుకోట జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి రివార్డు ప్రకటించినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment