మృతురాలు మల్లీశ్వరీ
హుజూరాబాద్: ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ తల్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. చిన్న కూతురికి గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కన్నీరుమున్నీరైంది. ఇరుగుపొరుగు వారి సలహాతో పిల్లలు పుట్టేందుకు రీకనలైషన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. బుధవారం ఆపరేషన్ చేయించుకుం ది. అది వికటించి ఆ మహిళ అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం ఘణపూర్‌కు చెందిన ఆవుల రఘుపతికి శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన మల్లీశ్వరి(28)తో ఆరేళ్లక్రితం వివాహమైంది.
రఘుపతి హైదరాబాద్‌లో గుమాస్తగా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఐదు నెలల క్రితం చిన్నకూతురు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజులకు చిన్నకూతురుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి గుండెకు రంధ్రం ఉందని చెప్పడంతో బోరున విలపించారు. ఇంటి చుట్టుపక్కల వారి సలహా మేరకు మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. రీకనలైజేషన్ ఆపరేషన్ కోసం హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ జరుగగా అర్ధరాత్రి అది వికటించి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment