పోలీసుల అదుపులో ఫేస్‌బుక్ జంట
వేములవాడ: ఫేస్‌బుక్ పరిచయం కులాలకు, కన్నకొడుకులకు ఏమాత్రం అడ్డురాలేకపోయింది. కట్టుకున్న మొగున్ని, కన్న కొడుకులను వదిలేసి ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తితో ఉడాయించి వేములవాడకు చేరుకుని ఏడాదిన్నరగా వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్న వైనం మంగళవారం వేములవాడలో వెలుగుచూసింది.
ఏడాదిన్నరగా మహిళ కోసం వెతుకున్న బంధువులు ఎట్టకేలకు వేములవాడలోని బద్దిపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం అందుకుని మంగళవారం వేకువజామున చేరుకున్నారు. వారిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో తప్పించుకునే యత్నంలో ప్రియుడు బంగ్లా పైనుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడు.
దీంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే ఆ ప్రాంతంలో కాసుకుని కూర్చున్న బంధువులు, అతడిని పట్టుకుని బంధించారు. విషయం కాలనీలో తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఇరువురిని ఠాణాకు తరలించారు.\ సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....
ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన యువతికి, బెల్లంపల్లికి చెందిన నిఖిల్‌నందాతో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఆమె ఏడాదిన్నర క్రితం వేములవాడకు చేరుకుని, నందాతో సహజీవనం సాగిస్తోంది.
ఆమె కుట్టు మిషన్ పనిచేస్తుండగా, నిఖిల్‌నందా ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర తరువాత వీరి వ్యవహారం.. ఖమ్మంలో ఉన్న ఆమె బంధువులకు తెలిసింది, వారు మంగళవారం ఇక్కడికి చేరుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
ఆమె భర్త, ఏడాది క్రితమే.. తన భార్య కనిపించడం లేదంటూ కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్కడి పోలీసులతో మాట్లాడిన అనంతరం మరో కేసు ఇక్కడ నమోదు చేయకుండా తమ కానిస్టేబుల్ ఇచ్చేసి కొణిర్ల పోలీస్‌స్టేషన్‌కు ఆ ఇద్దరినీ పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment