మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
ఎల్లలు లేని ప్రేమను ఎల్లవేళలా
పొందాలనుకున్నారు.
కులాలు వేరైనా.. అంతస్తులు వేరైనా..
అవేవీ అడ్డుకాదనుకున్నారు
తల్లిదండ్రులను ఎదిరించి గెలిచామనుకున్నారు
కానీ గెలిచింది వారు కాదని..
వారి ప్రేమ కాదని..
చివరకు గెలిచింది ఆ కులం అనే అడ్డుగోడేనని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు..
మొన్న మిర్యాలగూడలో ప్రణయ్,
అమృతల ప్రేమ విషాదాంతం..
నిన్న ఎస్సార్‌నగర్‌లో
మాధవి, సందీప్‌లపై కత్తి దాడి..
నేడు అదే కులం అగ్నికి మరో యువకుడి బలి..!
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి దూరం చేశారని మనస్తాపంతో ఓ ప్రేమికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గాయపడ్డ శ్రీకాంత్‌ను స్థానికులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుజాత, ముత్తయ్యల కుమారుడు శ్రీకాంత్, నకిరేకల్‌లోని విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన షణ్ముఖాచారి కూతురు శ్రీహర్షలు ఇనుపాముల సమీపంలోని సెయింట్‌ఆన్స్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్‌లో 2015 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. 2016 జూన్‌లో పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని శ్రీహర్ష తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పెళ్లి తర్వాత ఆమె హాస్టల్లో ఉండే చదువుకుంటోంది. సెలవుల్లో సంతోష్‌నగర్‌లోని తన భర్త ఇంటికి వచ్చేది. ప్రశాంత్ బీ ఫార్మసీ చదివి ప్రస్తుతం డ్రైవర్‌గా పని చేస్తుండగా, శ్రీహర్ష మహబూబ్‌నగర్‌లోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది.
ఇద్దరి మధ్యా మనస్పర్థలు..!
వాట్సాప్ చాటింగ్ విషయంలో ఏడాది కింద శ్రీహర్ష, శ్రీకాంత్‌ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో విష యం తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీహర్షను పుట్టింటికి తీసుకెళ్లారు. అప్పట్లో నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. తనకు విడాకులు ఇప్పించాలంటూ 2017లో శ్రీహర్ష దరఖాస్తు కూడా చేసుకోగా, కేసు కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం. శ్రీహర్ష కాలేజీకి శ్రీకాంత్ తరచూ వెళ్లి గొడవపడే వాడని తెలుస్తోంది. శ్రీహర్ష స్నానం చేస్తున్న ఫొటోలను ఈ నెల 19న కాలేజీ గోడలపై అతికించాడని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీహర్ష.. శ్రీకాంత్‌ను నిలదీయగా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీనిపై ఆమె మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
తక్కువ కులమనే విడదీశారు: ముత్తయ్య
శ్రీహర్ష తల్లిదండ్రుల వేధింపుల కారణంగానే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీకాంత్ తండ్రి ముత్తయ్య ఆరోపించాడు. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు, కోడలును పెద్ద మనసుతో స్వాగతించానని పేర్కొన్నాడు. గర్భవతిగా ఉన్న తమ కోడలిని డెలివరి పేరు చెప్పి పుట్టింటికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారని ఆరోపించాడు. ఈ ఘటనతోనే తన కొడుకు తీవ్ర మనో వేదనకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై, తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. తన భార్య సుజాతను కూడా పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారని పేర్కొన్నాడు. శ్రీహర్ష తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.
ప్రసవం పేరుతో తీసుకెళ్లి.. : ప్రణయ్, శ్రీకాంత్ బావ
శ్రీహర్ష 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న తండ్రి షణ్ముకాచారి, ఆయన భార్య ఏడాది కింద తమకు తెలియకుండానే ప్రసవం పేరుతో వారి వెంట తీసుకెళ్లారని శ్రీకాంత్ సోదరి భర్త ప్రణయ్ తెలిపాడు. ఇదే విషయాన్ని భర్తకు కూడా శ్రీహర్ష ఫోన్‌లో చెప్పిందని, ఆ తర్వాత ఆమె ఫోన్ చేయకపోవడం.. తాము చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వివరించాడు. అదే సమయంలో తనకు విడాకులు కావాలంటూ శ్రీహర్షతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయించారని, విడాకులు ఇచ్చేందుకు శ్రీకాంత్ నిరాకరించడంతో దొంగతనం, గంజాయి విక్రయం వంటి అక్రమ కేసులు పెట్టించారని చెప్పాడు. శ్రీహర్షకు అబార్షన్ చేయించడమే కాకుండా, తాజాగా మరో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకున్న శ్రీకాంత్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment