మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లా కుర్ కేడ్ తాలుకా సమీపంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు జరుగుతుండగా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చేరుకుని మిక్చర్ ప్లాంట్‌తో పాటు 30 వాహనాలను దగ్దం చేశారు. ఉత్తర గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న కుర్ కేడ్ తాలుకా కేంద్రం, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య అటవీ ప్రాంతానికి చేరువలో ఉంటుంది. మొదట మావోయిస్టులు జాతీయ రహదారి నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న వాహనాలను, రోడ్డు నిర్మాణం కోసం కంకర మిక్చర్ తయారు చేసే యూనిట్‌ను పేల్చేశారు.
ఈ సమచారం అందుకున్న బలగాలు ఘటనా స్థలానికి చేరుకునేందుకు రెండు వాహనాల్లో బయలు దేరాయి. అప్పటికే పొదల మాటున దాక్కున్న మావోయిస్టులు పోలీసుల వాహనాలను మందుపాతరలతో పేల్చేశారు. ఈ ఘటనలో దాదాపు 16 మంది సి-60 బెటాలియన్‌కు చెందిన జవాన్లు దుర్మరణం పాలయ్యారు.
మరణించిన జవాన్లు వీరే..
గడ్చిరోలి జిల్లా కుర్ కేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పేల్చివేసిన మందుపాతర ఘటనలో మరణించిన జవాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. సాహు దాత్ బాజీరావ్ మడావి, ప్రమోద్ మహదేవ్ రావ్ బోయర్, రాజూ నారాయణ్ గైక్వాడ్, కిషోర్ యశ్వంత్ , సంతోష్ దేవి దాస్ చౌహాన్, సర్జిరావ్ ఎక్ నాథ్, దయానంద్, భూపేష్ పాండ్ రంగ్ జీ, ఆరీఫ్ తౌషిక్ షేక్, యోగాజీ సీతారాం, పురాన్షా ప్రతాప్షా, లక్ష్మణ్ కేశవ్, అమ్రుత్ ప్రభుదాస్ బదాడే, అగ్రమాన్ భాక్షిరహాతే, నితిన్‌లు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు.
ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
మందుపాతర దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఘటన వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. జవాన్ల కుటంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. మరో వైపున నక్సల్స్ ఏరివేత కోసం కుర్ కేడ్‌తో పాటు ఇంద్రావతి పరివాహక ప్రాంతంలో పోలీసు అధికారులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment