నిందితుడు గణేష్‌యాదవ్
అమీర్‌పేట: కేసు విచారణలో జాప్యం చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కారణంగా డ్యూటీలో ఉన్న ఎస్సైపై దాడికి యత్నించిన వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కోర్టులో ప్రవేశ పెట్టగా అతడి మానసిక స్థితిపై న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్గొండకు చెందిన గణేష్‌యాదవ్ ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని వెంగమాంబ హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్ మెస్ చార్జీలు చెల్లించక పోవడంతో నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి డబ్బుల కోసం అతడిని ఒత్తిడి చేయడంతో ఇరువురి మద్య మాటా మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ గణేష్‌యాదవ్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.
సీపీ ఆదేశాల మేరకు ఎస్సై నరేష్ విచారణ చేపట్టి నివేదిక రూపొందించాడు ఈ సందర్భంగా గణేష్‌యాదవ్ స్నేహితులు నవీన్ తదితరులను విచారించగా ప్రతి రోజు ఏదో విషయమై గొడవ పడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గణేష్ తల్లిదండ్రులకు తెలిపి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడించారు. దీని ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ హాస్టల్‌లో జరిగిన గొడవపై తన తల్లిదండ్రులకు ఎందుకు చెప్పారంటూ బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సైతో గొడవ పడ్డాడు. నీ ప్రవర్తన సరిగా లేని కారణంగా మీ తల్లిదండ్రులకు చెప్పాల్సి వచ్చిందని, ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడిస్తానని తీసుకెళ్తుండగా ఆగ్రహానికిలోనైన గణేష్ ఎస్సై నరేష్ చొక్కా పట్టుకుని పక్కకు నెట్టి వేశాడు. దీంతో అడ్మిన్ ఎస్సై నవీన్‌కుమార్ జోక్యం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. గణేష్‌యాదవ్ మానసిక స్థితిపై అనుమానం రావడంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. రాత్రి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఎస్సై సాయినాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment