నిందితుడు ప్రవీణ్ డేవిడ్ స్వాధీనం చేసుకున్న బొమ్మ తుపాకీ
గచ్చిబౌలి: బురఖా ధరించిన ఓ వ్యక్తి బ్యాంక్ లోపలికి వెళ్లి బొమ్మ తుపాకీతో లాకర్ తెరవాలంటూ బ్యాంక్ మేనేజర్‌ను బెదిరించాడు. భయపడిన సిబ్బంది చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. కౌంటర్‌లోని క్యాష్ తీసుకొని గన్ చూపిస్తూ పారిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు రాళ్లతో దాడి చేసి, నిందితుడిని పట్టుకుని నగదుతో సహా బ్యాంక్ సిబ్బందికి అప్పగించారు. బ్యాంక్ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. సినిమా సీన్‌ను తలపించేలా ఉన్న ఈ సంఘటన మణికొండలోని కరూర్ వైశ్య బ్యాంక్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ రాంబాబు, బ్యాంక్ మేనేజర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్, మహరిణిపేటకు చెందిన ప్రవీణ్ డేవిడ్ ఓయూ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతను బురఖా ధరించి, బొమ్మ తుపాకీ, యాసిడ్ బాటిల్, కత్తితో హుడాకాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లోకి ప్రవేశించాడు. మెయిన్‌డోర్ పక్కనే ఉన్న మేనేజర్ మహేందర్ కుమార్ క్యాబిన్‌లోని వెళ్లి బొమ్మ తుపాకీ చూపించి లాకర్ తెరవాలంటూ బెదిరించారు.
దీంతో ఆందోళనకు గురైన మేనేజర్ సిబ్బంది వద్దకు పరుగు తీశాడు. నిందితుడు లే డౌన్ అంటూ తుపాకీ చూపించడంతో మేనేజర్‌తో పాటు సిబ్బంది ఒక వైపునకు వెళ్లి చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. క్యాష్ కౌంటర్లోకి ప్రవేశించి నిందితుడు క్యారీ బ్యాగ్‌లో నగదు తీసుకొని బయటికి వెళుతూ రోడ్డుపై ఉన్న వారికి తుపాకీ చూపించి బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లగానే స్థానికులు అతడిపై రాళ్లతో దాడి చేయడంతో తల కు తీవ్ర గాయాలైన అతడిని పట్టుకొని బ్యాంక్ సి బ్బందికి అప్పగించారు. నగదు తీసుకున్న బ్యాంక్ సిబ్బంది నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. నిందితుడికి అదే బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బొమ్మ తుపాకీ, కత్తి, యాసిడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు పరిశీలించారు.
తుపాకీ అనుకుని బయపడ్డాం: మేనేజర్
నిందితుడి చేతిలో ఉన్నది తుపాకీ నిజమైన తుపాకీ అనుకొని బయపడ్డామని బ్యాంక్ మేనేజర్ మహేందర్ కుమార్ తెలిపారు. అతను తమను బెదిరించి క్యాష్ కౌంటర్‌లోని నగదు తీసుకొని పరారయ్యాడని. స్థానికులు అతడిని పట్టుకుని తమకు అప్పగించారన్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే....
బికాం వరకు చదువుకుని 2016లో విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశానని నిందితుడు ప్రవీణ్ డేవిడ్ తెలిపాడు. కొన్నాళ్లుగా ఉద్యోగం లేక పోవడంతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. రెండు రోజుల క్రితం సమీపంలోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో దోపిడీ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో టోలీచౌకీలో బురఖా, బొమ్మ తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment