సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ
సాక్షి, వేములవాడ : పట్టణంలోని సుబ్రమణ్యంనగర్‌లో పట్టపగలే నడిరోడ్డుపై దుండగులు దారుణహత్యకు తెగబడ్డారు. నాగుల రవి (30) అనే యువకుడిని కత్తులతో విచాక్షణరహితంగా దాడి చేసి హత్య చేసిన ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..ఇంటి పనులపై బయటికి వెళ్లిన రవి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బైక్‌పై అద్దెకుంటున్న ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ముగ్గురు బైక్‌పై వచ్చి కత్తులతో దాడి చేసి హత్య చేసి బైక్‌పై పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రవి మృతదేహాన్ని, ఒంటిపై కత్తులతో దాడి చేసిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రవికి తల్లి దేవమ్మ, సోదరుడు సరిల్, సోదరి జ్యోతి ఉన్నారు. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరగడంతో వేములవాడలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలాన్ని ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు పరిశీలించారు.
సీసీ కెమెరాల్లో నిందితుల ఆచూకీ
మిట్ట మధ్యాహ్నం సుబ్రమణ్యంనగర్‌లో నాగుల రవిని బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన చిత్రాలు సీసీ కెమెరా పుటేజీల్లో పోలీసులకు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసుబృందాలు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
గతంలోనూ గొడవలు..
‘ఆడదాని వల్లే నా కొడును పొట్టన పెట్టుకున్నారని’ తల్లి దేవమ్మ రోదిస్తూ పోలీసులకు తెలిపింది. గతంలో వివాహేతర సంబంధం కారణంగా గొడవలు జరిగాయని, అయినా తాము ఇతర ప్రాంతానికి వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నా తన కుమారుడిని వీడలేదని వాపోయింది. ఆరునెలలుగా తన కొడుకు రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తన పని తాను చేసుకుంటూ బతుకుతున్నాడని చెప్పింది. నిందితులను పట్టుకుని శిక్షించాలని డీఎస్పీ వెంకటరమణను వేడుకుంది. కాగా మాకు ప్రాణభయం ఉందని పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే తమ్ముడు నాగుల రవి శవాన్ని తీస్తామని అతడి సోదరుడు సరిల్ డీఎస్పీ వెంకటరమణ ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సహాయంతో శవాన్ని జీపులో ఎక్కించి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురిని గుర్తించాం
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, పీడీయాక్ట్ నమోదు అయ్యేలా చూస్తామని డీఎస్పీ వెంకటరమణ శుక్ర వారం రాత్రి విలేకరులకు తెలిపారు. జావేద్, అక్రం, అహ్మద్ అనే ముగ్గురు అన్నదమ్ములను సీసీ కెమెరాలో గుర్తించినట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ వెంకటస్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment