
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడిని కొంతమంది కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్‌రావునగర్ డివిజన్, మహేశ్‌నగర్ గాయత్రి అపార్టుమెంట్‌లో ఓ మహిళ తన 9 సంవత్సరాల కొడుకు, తల్లితో కలిసి నివాసముంటోంది. భర్తను వదిలేసిన ఈమె యూసుఫ్‌గూడ నుంచి నెలన్నర క్రితమే ఇక్కడికి వచ్చింది. ఇదిలావుండగా రంగారెడ్డి జిల్లా, బాషామోనిగూడేనికి చెందిన గుర్రం శివారెడ్డి(30) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటు కొత్తపేట మార్గదర్శి కాలనీలో ఉంటున్నాడు.
సదరు మహిళ శివారెడ్డితో నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. శివారెడ్డి తరచుగా మహేశ్‌నగర్‌కు వచ్చి వెళ్తుంటాడు. సోమవారం కూడా శివారెడ్డి ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో సదరు మహిళ సోదరుడు తన భార్యతో కలిసి మహేశ్‌నగర్‌లోని సోదరి వద్దకు రాగా మహిళ సోదరుడుకి శివారెడ్డికి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న శివారెడ్డిపై దాడి చేసి బయటకు గెంటేశారు. ఆ సమయంలో శివారెడ్డి వంటిపై లుంగీ మాత్రమే ఉంది. దీంతో బట్టల కోసమని తిరిగి ఫ్లాట్ వద్దకు వెళ్లగా లుంగీ కూడా లాగేసి కొంతమంది కర్రలతో శివారెడ్డిపై దాడి చేశారు. దాడిలో తల పగిలి కింద పడిపోయాడు. రోడ్డుపై పడివున్న శివారెడ్డిని పక్కనే ఉన్న పొదల్లో పడేశారు.
శివారెడ్డి మృతదేహం
ఇదంతా గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న శివారెడ్డిని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.