
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కటికె శ్రీను
బిజినేపల్లి రూరల్ మహబూబ్ నగర్ : మాంసం తీసుకుని పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో దుకాణ యజమానికి, ఓ మహిళకు మధ్య గొడవ చోటుచేసుకుంది. అది ప్రాణాల మీదికి తెచ్చింది. ఆ వివరాలు... బిజినేపల్లిలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. వారం క్రితం సంతకు వట్టెం గ్రామానికి చెందిన లక్ష్మి వచ్చింది. ఓ మటన్ దుకాణం వద్ద మాంసం తీసుకుని రూ.10 తక్కువగా ఉన్నాయని చెప్పింది.
ఈ క్రమంలోనే షాపు యజమానికి, మహిళకు చిన్న గొడవ జరిగింది. దీంతో మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై ప్రదీప్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాతే షాపు యజమానిని పిలిపించాలి. అదేమీ లేకుండానే కటికె శ్రీనును పోలీస్‌స్టేషన్‌కు తీసుకు రమ్మని హోంగార్డులను పురమాయించాడు ఎస్సై. వచ్చిన తర్వాత తమదైన శైలిలో మందలించారు.
బెల్ట్‌తో కొట్టడంతో మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రాత్రి బాగానే ఉన్నా మరుసటి రోజు ఉదయం కళ్లు తిరిగి శ్రీను కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల తర్వాత రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు చిన్న మెదడులో కొద్దిభాగం రక్తం గడ్డ కట్టుకుపోయిందని, సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్ తరలించాలని బుధవారం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీకి దాదాపు 15లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే సమయంలో బాధితుడు కోమాలోకి వెళ్లడంతో సర్జరీ చేసినా కోలుకోవడం కష్టమేనని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జిల్లా ఆరెకటిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారు స్థానిక ఎమ్మెల్యేను కలిసి ఘటనను వివరించారు. దీనిపై ప్రభుత్వపరంగా పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నేనెవర్నీ కొట్టలేదు
వట్టెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ బిజినేపల్లిలో ఉన్న కటికె శ్రీనివాసులుతో ఘర్షణ పడింది. ఠాణాకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పింది. ఫిర్యాదు ఇవ్వమంటే ఇవ్వలేదు. దాంతో అతన్ని పిలిపించి మందలించాను తప్ప చేయిచేసుకోలేదు.
– ప్రదీప్‌కుమార్, ఎస్సై