మృతిచెందిన చెన్నారెడ్డి
పెనుబల్లి: ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లిలోని వియం బంజర్ సప్తపది ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఇది జరిగింది. అడవిమల్లేలకు చెందిన నారెడ్డి చెన్నారెడ్డి(55), వియం బంజర్‌లో ఉంటున్న తన కుమారుడు నాగిరెడ్డి ఇంటికి వెళ్లాడు.
పాఠశాలల బంద్ జరుగుతుండటంతో మనవరాళ్ళు ఆకాంక్ష, కాంక్షితలను వెంటబెట్టుకుని ద్విచక్ర వాహనంపై అడవి మల్లేలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్న భోజనం అనంతరం చెన్నారెడ్డి, తన ద్విచక్ర వాహనంపై ఆ పిల్లలందరినీ వియం బంజర్‌లోని వారి ఇంటికి తీసుకెళుతున్నాడు. వియం బంజర్‌లోని రోడ్డు పక్కనున్న కుమారుడు నాగిరెడ్డి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా హైదరారాబాద్ నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న సత్తుపల్లి డిపో బస్సు ఢీకొంది.
వాహనం నడుపుతున్న చెన్నారెడ్డి(55)కి, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోగల పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చెన్నారెడ్డి(55) మృతిచెందాడు.
మృతదేహానికి పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. ఖమ్మంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో ఆకాంక్ష, కాంక్షిత చికిత్స పొందుతున్నారు. చెన్నారెడ్డి పెద్ద కుమారుడు వెంకటరామి రెడ్డి ఫిర్యాదుతో కేసును ఏఏస్సై మన్మధరావు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment