ఘటనా స్థలంలో రవీంద్ర మృతదేహం, పక్కన తీవ్రంగా గాయపడిన పృధ్వీరాజ్
నాయుడుపేట టౌన్: కుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిపత్రికలు పంపిణీ చేస్తూ ఆనందంగా ఉన్న సమయంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లిపత్రికలను పంచేందుకు బైక్‌పై వెళ్లిన పెళ్లి కుమారుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మృతుడి సమీప బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాయుడుపేట పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు పట్టణంలోని పోలీస్‌కాలనీ సమీపంలో ఏకేనగర్‌లో నివాసం ఉంటున్న బత్తుల రవీంద్ర(64) చెన్నైలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. అతని ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి కుదరడంతో ఈ నెల 16న బెంగళూరులో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం రవీంద్ర తన బావమరిది చోడిబోయిన పృధ్వీరాజ్‌తో కలిసి బంధువులకు పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బైక్‌పై బయలుదేరారు.
పలుచోట్ల పెళ్లిపత్రికలు ఇచ్చి నాయుడుపేటలో ఉన్న అతని బంధువు ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపల్లో ఇంటికి చేరుకునే సమయంలో నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో కిందపడిన రవీంద్ర తలపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతనితోపాటు ఉన్న పృధ్వీరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుృధ్వీరాజ్‌ను 108 అంబులెన్స్ సిబ్బంది సహకారంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సలు జరిపి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమై లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
తల్లడిల్లిన కుటుంబసభ్యులు
ఎంతో సంతోషంగా కుమారుడి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లికుమారుడి తండ్రి బత్తుల రవీంద్ర నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుసుకుని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు కొందరు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన అనంతరం నెల్లూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment