తల నుజ్జయి మృతి చెందిన రోహిత్ వర్మ
సాక్షి, తగరపువలస(విజయనగరం) : జాతీయ రహదారిపై భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ వలందపేట వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణంలోని కృష్ణరాజపురం గ్రామానికి చెందిన దాట్ల రోహిత్‌వర్మ(28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో విజయనగరం సమీప ధర్మపురి రింగ్‌రోడ్డుకు చెందిన బీఎస్సీ విద్యార్థిని ద్విభాష్యం దీపికశర్మ(23) స్పల్ప గాయాలతో బయటపడింది. వర్మ ఇటీవల సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఎంపికై బీదర్‌లో ఉద్యోగం చేస్తూ సెలవుపై వచ్చాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన వర్మ, దీపికశర్మ ఇద్దరూ మధ్యాహ్నం మధురవాడ డీమార్ట్‌లో దుస్తులు కొనుగోలు చేసేందుకు బుల్లెట్‌పై బయలుదేరారు.
వలందపేట వద్ద హైవే నుంచి సబ్‌వేకు దిగిన సమయంలో అక్కడ పేరుకుపోయిన తారు వ్యర్థాలకు బుల్లెట్ స్కిడ్ అయి పడిపోయింది. దీంతో బుల్లెట్‌పై నుంచి ఇద్దరూ తుళ్లి పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వెనుక భాగం రోహిత్ తలపైనుంచి వెళ్లడంతో నుజ్జయింది. దీపిక చేతికి గాయం కావడంతో సంగివలస ఎన్‌ఆర్‌ఐ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ ఉన్నా వర్మ ధరించకపోవడంతో తల పగిలిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుని తల్లిదండ్రులకు రోహిత్ ఒక్కడే కుమారుడు. ఆయన తండ్రి పెరుమాళ్లరాజు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిసింది. భీమిలి ట్రాఫిక్ ఎస్‌ఐ ఎస్.రామారావు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment