
ఓ కామాంధుడు చేసిన నీచమైన పనిని కళ్లప్పగించి చూడటమే..
బెంగళూరు : ఓ కామాంధుడు చేసిన నీచమైన పనిని కళ్లప్పగించి చూడటమే ఆ పసికందుకు మరణశాసనమైంది. ఓ బాలికపై జరిపిన అత్యాచారాన్ని ఎక్కడబయట పెడుతుందోననే భయంతో కర్కోటకుడిగామారిన కామాంధుడు పసికందును పెట్రోల్ పోసి అంతమొందించాడు. ఈ ఉదంతం తాలూకాలోని హల్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని అరళేరి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని హుల్కూరు గ్రామానికి చెందిన మునిరాజుకు వివాహమైంది. ఇతనికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య 7 నెలల గర్భిణి. మునిరాజు గార పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మైనర్ బాలికపై కన్ను వేశాడు.
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే పడుకొని ఉన్న నాలుగేళ్ల వయసున్న బాలిక ఈ ఉదంతాన్ని కళ్లారా చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందోనని భావించిన మునిరాజు ఆ బాలిక నోరు మూసి అక్కడి నుంచి తీసుకెళ్లి చంపి మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. చిన్నారి వేద కనిపించక పోవడంతో పోషకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో మునిరాజు సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాప్ అని సమాధానం వచ్చింది. దీంతో గాలింపు చేపట్టి శనివారం నిందితుడు మునిరాజును అరెస్ట్ చేశారు.