పిల్లలతో చాందిని, ప్రవీణ్ దంపతులు (ఫైల్)
సాక్షి, వికారాబాద్: మతాలు వేరైనా కలిసి జీవించాలనుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తెగింపు వారిని ఎక్కువ రోజులు కలిసి ఉండనివ్వలేదు. అనుమానం పెనుభూతమై వారి కాపురాన్ని కూల్చేసింది. కట్టుకున్న భర్త.. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్యచేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తన అర్ధాంగితో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన దుర్ఘటన ఆదివారం అర్ధరాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మోతీబాగ్ కాలనీలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మోతీబాగ్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ప్రవీణ్, చాందిని(30) దంపతులు.. కుమారుడు అయాన్(10), కూతురు (5) ఏంజిల్‌తో కలిసి ఉంటున్నారు. ప్రవీణ్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. చాందిని ధన్నారం సమీపంలోని స్వామి వివేకానంద గురుకుల పాఠశాలలో ప్రైవేటులో టీచర్‌గా పనిచేస్తుండేది. పిల్లలు ఇదే పాఠశాలలో చదువుతున్నారు.
భార్యపై అనుమానం...
ప్రవీణ్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. చాందిని ముస్లిం సామాజిక వర్గం. ప్రవీణ్ స్వస్థలం తాండూరు.. కాగా చాలా రోజుల క్రితం వారి కుటుంబం హైదరాబాద్‌లోని లింగంపల్లిల్లో స్థిరపడింది. చాందినిది లింగంపల్లి. వీరిద్దరికి అక్కడే చాలా కాలంగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చాందిని కుటుంబీకులు ఆమెను బలవంతంగా మరోవ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేకపోయినా కొన్నాళ్లు అతడితో కాపురం చేసిన చాందినికి ఓ బాబు పుట్టాడు. అనంతరం కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడిపోయారు. అనంతరం ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లి చేసుకొని వికారాబాద్‌లో కాపురం పెట్టారు. చాందిని తనతోపాటు కుమారుడు అయాన్‌ను వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లకు వీరికి కూతురు ఏంజిల్ పుట్టింది. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలే చేస్తున్నా సంతోషంగా ఉండేవారు. ఇటీవల చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ పలుమార్లు గొడవపడినట్లు సన్నిహితులు తెలిపారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రవీణ్ తరచూ మద్యం తాగుతూ ఆమెపై దాడి చేస్తుండేవాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం మత్తులో ప్రవీణ్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.
మూడు రోజులుగా మత్తులోనే..
పది రోజుల క్రితం కూతురు ఏంజిల్ ఒంటిపై వేడినీళ్లు పడ్డాయి. దీంతో చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్ పాపను చూసేందుకు ఈనెల 2న వికారాబాద్‌కు వచ్చారు. అదే రోజు తమ్ముడు ప్రదీప్‌తో కలిసి ప్రవీణ్ మద్యం తాగాడు. మరుసటి రోజు ప్రదీప్ పుట్టినరోజు ఉండడంతో వారు ఇక్కడే ఉండిపోయారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకొని ఆ రాత్రి కూడా అన్నదముళ్లు మద్యం తీసుకున్నారు. 4వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రవీణ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. దీంతో అన్నదమ్ముళ్లు ఇద్దరూ రోజంతా మద్యం తాగారు. మూడు రోజులుగా మద్యం తాగుతుండడంతో చాందిని భర్తను వారించింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రవీణ్ తల్లి, తమ్ముడి ముందే భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో తాము ఇంటికి వెళ్తామంటూ హేమలత, ప్రదీప్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అనంతరం దంపతుల గొడవ తీవ్రమైంది. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డును తీసుకొని ప్రవీణ్ భార్య తలపై బలంగా మోదడంతో అక్కడిక్కడే మృతిచెందింది.
అప్పటికే నిద్రలో ఉన్న కుమారుడు అయాన్ లేచి తండ్రి దాడిని గమనించి ఏడ్చే ప్రయత్నం చేశాడు. ఏడుపు విని ఎవరైనా వస్తారనే భయంతో ప్రవీణ్ అతడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిద్రపోతున్న చిన్నారి తలపై రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. తర్వాత ప్రవీణ్ పిల్లలను తల్లి దగ్గర పడుకోబెట్టి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న తన తల్లి, తమ్ముడికి హత్య విషయం తెలిపాడు. దీంతో కంగారుపడిన వారు అతడిని తిట్టి పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకున్నాడు. దీంతో కంగారుపడిన తల్లి, తమ్ముడు నేరుగా వికారాబాద్ ఠాణాకు వెళ్లి ప్రవీణ్ తన భార్యతో గొడవపడుతున్నట్లు తెలిపారు. అంతలోనే అక్కడికి వచ్చిన నిందితుడు హత్య విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు.
దుబాయిలో ఉన్నాం..
తన కూతురు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన చాందిని తల్లి మున్నాబేగం బోరున విలపించింది. కూతురు హత్య విషయాన్ని లింగంపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు చెప్పగా నమ్మలేదు. తమ కూతురు దుబాయ్‌లో క్షేమంగా ఉందన్నారు. పోలీసులు చాందిని, అయాన్ ఫోటో చూపించడంతో చివరకు నమ్మారు. ఐదేళ్ల క్రితం తనకు దుబాయ్ వెళ్లేందుకు వీసా వచ్చిందని తన కుమారుడితో అక్కడికి వెళ్తున్నట్లు చెప్పి చాందిని ఇంటి నుంచి వచ్చిందన్నారు. ఎప్పుడూ సెల్‌ఫోన్లో వీడియో కాల్ మాట్లాడేదని, దుబాయ్‌లోనే ఉన్నట్లు చెప్పిందని కన్నీటి పర్యంతమయ్యారు.
తీవ్ర కలకలం..
ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు దారుణంగా హత్యకు గురవడం పట్టణవాసులను తీవ్రంగా కలచివేసింది. తల్లి పక్కనే నిద్రలో ఉన్నట్లుగా మృతదేహాలు పడిఉన్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. మృతురాలితల్లి మున్నాబేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హంతకుడు ప్రవీణ్‌తో పాటు తల్లి హేమలత, తమ్ముడు ప్రదీప్‌ను పోలీసులు అదపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment