పోలీసుల అదుపులో నిందితుడు అభిషేక్ ద్వివేది
భోపాల్: ‘నేను అమిత్ షా పీఏని మాట్లాడుతున్నాను.. నా స్నేహితుడి ట్రాన్సఫర్ ఆర్డర్‌ను క్యాన్సల్ చేయండి’ అంటూ ఓ వ్యక్తి ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేశాడు. అనుమానం వచ్చి వారు అమిత్ షా కార్యాలయానికి సమాచారమిచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అభిషేక్ ద్వివేదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలు.. మధ్యప్రదేశ్ రేనాకు చెందిన అభిషేక్ ద్వివేది స్నేహితుడొకరిని గ్వాలియర్‌లోని పరివాహన్ ఆయుక్త్ కార్యాలయానికి ట్రాన్సఫర్ చేశారు. అయితే అతడు వేరే జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కావాలని భావించాడు. దాంతో అభిషేక్ సాయం కోరాడు. (‘ఆ నిర్ణయంతో 2.8 లక్షల ఉద్యోగాలు’)
ఈ క్రమంలో ఈ నెల 3న నిందితుడు నితిన్ గడ్కరి వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి తాను అమిత్ షా పర్సనల్ సెక్రటరీనని పరిచయం చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితుడి ట్రాన్సఫర్ ఆర్డర్‌లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరాడు. అనుమానం వచ్చిన సిబ్బంది.. దీని గురించి అమిత్ షా సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు ఈ ఫోన్ కాల్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని రేనాకు చెందిన అభిషేక్‌గా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు ముంబై పారిపోయాడు. (నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...)
పోలీసులు అతడి కోసం నవీ ముంబైలోని కోలాంబేలి, ఖార్గర్, బేలాపూర్, తలోజా ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతన్ని ఇండోర్‌లో పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అభిషేక్ దగ్గర నుంచి అతడు కాల్ చేయడానికి ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అభిషేక్ తన బాల్య స్నేహితుడు వినయ్ సింగ్ బాగెల్, పరివాహన్ నిరిక్షక్ ట్రాన్సఫర్ ఆర్డర్‌ను రద్దు చేయమని కోరినట్లు చెప్పడంతో ఇలా చేశానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment