న్యూఢిల్లీ : బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డతో రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతల కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నిలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, రాజా సింగ్, లక్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. జూలై 6 నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు లాంఛనంగా ప్రారంభం కానుందని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిధిగా వస్తారన్నారు. తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో పాటు ముఖ్యమంత్రి కుమార్తె ఓటమిని తట్టుకోలేని టీఆర్‌ఎస్ సర్కార్ తమ కార్యకర్తలపై దాడులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామన్నారు. ఒక మహిళా అధికారిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడు దాడి చేయడం దుర్మార్గమన్నారు. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడటం దారుణమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సోదరుడిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగులతో ధర్నాలో పాల్గొంటామని హెచ్చరించారు.
మజ్లిస్ చెప్పుచేతుల్లో ఉండటం వల్లనే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని దుయ్యబట్టారు. జులై 17న రాష్ట్రంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని.. దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించామని లక్ష్మణ్ తెలిపారు. కాగా జులై 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. 2023లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తూ.. అప్పుడు తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment