పీయూష్‌కు వినతి పత్రం ఇస్తున్న లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రత్యేక ప్రణాళికలు రచించి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల అధ్యక్షుల సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని, అంతకంటే ముందు జాతీయ సంఘటన్ ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించి నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై, గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతంపై నివేదికలు సిద్ధం చేస్తారని అన్నారు.
ముఖ్యంగా తెలంగాణలోని 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారని తెలిపారు. దళిత్ అదాలత్, గిరిజన గర్జన పేరుతో కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారని అన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తికానున్న సందర్భంగా 15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీని బూత్ లెవెల్‌లో బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్‌షా తన పర్యటన సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఇక నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తదితరులు నెలకు రెండుసార్లు చొప్పున తెలంగాణలో పర్యటిస్తారని ఆయన తెలిపారు.
పీయూష్ గోయల్‌తో భేటీ
అమిత్ షాతో సమావేశం అనంతరం లక్ష్మణ్ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రతిపాదనలను అందించారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్–2లో మౌలాలి–సనత్‌నగర్ లైన్‌లో డిఫెన్స్‌కు చెందిన భూముల అప్పగింత అనుమతులు మంజూరయ్యేలా చూడాలని కోరారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, లింగంపల్లిలో ప్యాసింజర్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి ఉదయ్ రైళ్లు నడపాలని, కాచిగూడ–గుంతకల్లు, బీబీనగర్–నడికుడి, సికింద్రాబాద్–ముద్ఖేడ్ లైన్లను విద్యుదీకరించాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో వివిధ ప్రజా సంక్షేమ పథకాలను కేంద్రమే నేరుగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాతో భేటీ సందర్భంగా లక్ష్మణ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment