వ్యక్తి అనుమానాస్పద మృతి | man suspected of death | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Published Tue, Oct 3 2017 3:23 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

man suspected of death - Sakshi

కాశీబుగ్గ : దసరా పండగ నిమిత్తం భార్యను కన్నవారింట్లో చేర్చి తిరుగు ప్రయాణమైన భర్త కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి పూండి రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కె.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం మండలం కొండపేట గ్రామానికి చెందిన చాందినితో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన వల్లభ హరిప్రసాద్‌ (31)కు ఈ ఏడాది మార్చి 10న వివాహమైంది. ఈయన చిన్నచిన్న కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ విశాఖలోనే ఉంటున్నాడు. భార్యను దసరా పండగ సందర్భంగా ఇటీవలే కన్నవారింటికి పంపించాడు. శనివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ చేరుకున్నాడు. అక్కడికే తన భార్య చాందిని కూడా చేరుకుని ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. తిరిగి ఆదివారం రాత్రి కొండపేటకి వెళ్లి భార్యను కన్నవారింట్లో అప్పగించి దసరా సందడి ముగించుకుని తర్వాత విశాఖ వచ్చేయాలని సూచించి బయలుదేరాడు. అక్కడి నుంచి మిత్రుని బైకుపై సొంత గ్రామానికి బయలుదేరిన కొద్ది గంటలకే మృత్యువాతపడ్డాడు.

వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వేష్టేషన్‌కు కూతవేటు దూరంలో చరణుదాసుపురం 4వ ఫోల్‌ వద్ద ఆదివారం రాత్రి ఊహించని రీతిలో శవమై కనపడ్డాడు. శరీరం ముక్కలుముక్కలుగా పడి ఉండటంతో గుర్తు పట్టలేకపోయారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని ఆరా తీయగా ఫ్యాంటు జేబులో ఆధార్‌ కార్డు దొరికింది. అందులోని వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కొండపేటలోని అత్తవారింటికి వెళ్లిన పోలీసులు పలు అంశాలపై ఆరా తీశారు. ఎలాంటి తగాదాలు లేవని చెప్పడంతో అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం సమీపంలోనే ద్విచక్ర వాహనం పార్కింగ్‌ చేసి ఉందని, పలాస–విశాఖ రైలు ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement