సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో సంచలనం రేపిన గాదం మానస(19)పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లి హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో విగత జీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలికొండ ప్రాంతానికి చెందిన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. 6 నెలల పరిచయంలోనే ప్రేమ పేరిట సెల్‌ఫోన్ సంభాషణ కొనసాగించిన సాయికుమార్.. పథకం ప్రకారం నమ్మించి బయటకు రప్పించి మానసపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు తేలింది. కేసులో సాయికుమార్‌ను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించిన వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రేమ పేరిట గాలం
జనగామ జిల్లా నమిలికొండకు చెందిన పులి సాయిగౌడ్ హన్మకొండ హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హన్మకొండలోని దీన్‌దయాళ్ కాలనీకి చెందిన గాదం మానస హంటర్‌రోడ్డులోని నీలిమ జంక్షన్ వద్ద తండ్రితో కలసి కూరగాయల వ్యాపారం నడుపుకొంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిందితుడు కాలేజీకి వెళ్లే క్రమంలో 6 నెలల కింద మానసతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులుగా ఇద్దరూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో తనను కలిసేందుకు రావాలని సాయి కోరాడు. దీంతో భద్రకాళి గుడికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి మధ్యాహ్నం ఇంటి నుంచి మానస వెళ్లింది. ముందుగా అదాలత్ జంక్షన్ వరకు రావాలని చెప్పిన సాయి.. ఆ తర్వాత కాజీపేట వైపు రావాల్సిందిగా ఫోన్‌లో సూచించాడు. కాజీపేట వెళ్లి ఎదురు చూస్తుండగా.. మానసను కారులో తీసుకెళ్లిన సాయి.. చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారును నిలిపి మానసను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు సీపీ తెలిపారు.
కొత్త బట్టలు తొడిగి..
మానసది సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు సాయి ప్రయత్నించాడు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించేందుకు సాయం కోసం తన మిత్రులు మాచర్ల శ్రీకాంత్, నీలి శ్రీకాంత్‌లను తప్పుడు సమాచారంతో అక్కడికి రప్పించాడు. అయితే ఇద్దరూ ఘటనాస్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని చూసి షాక్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక నిందితుడు ఒక్కడే మానస మృతదేహాన్ని కారులో ఎక్కించి చీకటి పడే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ సెంటర్ మీదుగా తిరుగుతూ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు. మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి కారులో బయల్దేరి హంటర్ రోడ్డులోని న్యూ శాయంపేట వద్ద రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని మానస ఒంటిపై రక్తసిక్తమైన దుస్తులను తీసి కొత్త డ్రెస్ వేశాడు. అక్కడి నుంచి విష్ణుప్రియ గార్డెన్స్ పరిసర ప్రాంతానికి చేరుకుని ఎవరికీ కనిపించకుండా నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని వేసి తన స్వగ్రామమైన నమిలికొండకు వెళ్లిపోయాడు.
సోదరుడి ఫిర్యాదుతో..
చీకటి పడినా మానస తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అన్నయ్య శ్రీనివాస్ బుధవారం రాత్రి హన్మకొండలోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. సాయికుమారే మానసను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా సాక్ష్యాధారాలను సేకరించి గురువారం మధ్యాహ్నం నమిలిగొండలో అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేసేందుకు కృషి చేసిన పోలీసులను సీపీ అభినందించారు.
ఎప్పుడేం జరిగింది..
బుధవారం
► మధ్యాహ్నం ఒంటి గంట: ఇంటి నుంచి బయటికి వెళ్లిన మానస
► 1.30 గం.కు: అదాలత్ జంక్షన్ నుంచి కాజీపేట బయల్దేరిన బాధితురాలు
► 2.00 గం.కు: కాజీపేట జంక్షన్ చేరుకుని నిందితుడి కారు ఎక్కిన మానస
► 2.30 గం.కు: అత్యాచారం.. హత్యకు గురైంది.
► మధ్యాహ్నాం 3.00 గంటల నుంచి నిందితుడు మానస మృతదేహంతో చిన్నపెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ జంక్షన్, అశోకా జంక్షన్ వరకు కారులో ప్రయాణం
► రాత్రి 8.30 గం.కు: మృతురాలి బట్టలు మార్చాడు.
► 9.00 గం.కు: మృతదేహాన్ని విష్ణుప్రియ గార్డెన్స్ వద్ద పడేసి పరారైన నిందితుడు.
► 9.43 గం.కు: డయల్ 100కి సమాచారం ఇచ్చిన స్థానికులు.
► 9.50 గం.కు: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
► 10.00 గం.కు: సంఘటన స్థలంకు చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూసీ బృందాలు
► 12.00 గం.కు: మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
గురువారం
► ఉదయం 10.30 గం.కు: మృతదేహానికి పోస్టుమార్టం
► మధ్యాహ్నం ఒంటి గంటకు: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment