పుత్తూరు : నారాయణవనంలో వివాహిత హత్య మిస్టరీ ఒక రోజు వ్యవధిలోనే వీడింది. వివాహేతేర సంబంధాలకు అడ్డుగా ఉందని సాక్షాత్తు భర్తే కిరాయి వ్యక్తులతో హత్య చేయించాడు. తన అక్క కొడుకుతో కలిసి దీనికి స్కెచ్ వేశాడు. పుత్తూరు ఇన్‌చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన కథనం..వైఎస్సార్ కడప జిల్లా, రైల్వే కోడూరుకు చెందిన సాధు శివకుమార్‌కు 15 ఏళ్ల క్రితం అదే ఊరికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివకుమార్ నారాయణవనంలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా సుజాత మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. దీం తో శివకుమార్ ఇతర స్త్రీలతో సన్నిహిత సంబంధాలు నెరపేవాడు. విడాకులు ఇవ్వాలని కోరినా సుజాత ససేమిరా అనడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని శివకుమార్ వ్యూహరచన చేశాడు.
అక్క కొడుకు సహకారంతో...
విషప్రయోగంతో సుజాతను కడతేర్చేందుకు దారులు అన్వేషించి , చివరకు హత్యనే మార్గంగా ఎంచుకున్నాడు. ఆపై, తిరుపతిలోని కాటన్ మిల్లు వద్ద కాపురముంటున్న తన అక్క కొడుకు రవికుమార్‌తో కలిసి ఆటోనగర్‌లో ఉంటున్న ఉపేంద్ర, నాగరాజును సంప్రదించి స్కెచ్ వేశాడు. నెత్తురు చిందించకుండా సుజాతను అంతమొందించాలంటూ రూ. 50 వేలతో డీల్ కుదుర్చుకున్నాడు. సుజాతను గుర్తు పట్టేందుకు వీలుగా పది రోజుల క్రితం వీరిద్దరినీ నారాయణవనానికి పిలిపించి తన స్నేహితులుగా ఆమెకు పరిచయం చేశాడు.
గొంతు నులిమి చంపేశారు
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఊరికి వెళుతున్నట్లు చెప్పి సోమవారం ఉదయం శివకుమార్ ఇంట్లో నుంచి వచ్చేశాడు. అప్పటికే బైపాస్ సమీపంలో సిద్ధంగా ఉన్న ఉపేంద్ర, నాగరాజును కలిశాడు. ఆ తర్వాత మద్యం సేవించిన ఉపేంద్ర, నాగరాజు మధ్యాహ్నం 12.15 సమయంలో శివకుమార్ ఇంటికి వెళ్లారు. తన భర్త వారిని స్నేహితులుగా పరిచ యం చేసి ఉండడంతో వారిని ఇంట్లోకి రమ్మంది. ఇదే అవకాశంగా ఆమెను హత్య చేసేందుకు వారు యత్నించారు. ఉపేంద్ర సుజాత కాళ్లూచేతులను పట్టుకోగా, నాగరాజు లెగ్గిన్‌తో ఆమె గొంతు బిగించాడు. సుజాత కేకలు పెట్టడడంతో మిద్దెపై కాపురముంటున్న వాళ్లు వచ్చి తలుపులు తట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందిందిందని చెప్పారు. మరో నిందితుడు రవికుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సీఐ కొండయ్య, ఎస్‌ఐ హనుమంతప్ప, పురుషోత్తం, ఏఎస్‌ఐ సురేష్, కానిస్టేబుళ్లు రాకేష్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి ఎస్పీ రాజశేఖర్‌బాబు రివార్డులు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
వీడిన వివాహిత హత్య మిస్టరీ
Published Wed, Oct 11 2017 4:14 AM | Last Updated on Wed, Oct 11 2017 4:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment