బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త | Hysband Kills Wife Nizampet Hyderabad | Sakshi
Sakshi News home page

బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త

May 25 2024 6:30 AM | Updated on May 25 2024 7:05 AM

Hysband Kills Wife Nizampet Hyderabad

మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు విఫల యత్నం

కత్తితో తానూ పొడుచుకుని ఆత్మహత్యా ప్రయత్నం

20 రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన

మీడియాకు వెల్లడించని పోలీసులు, స్థానికులు ఘటనపై  

తలెత్తుతున్న పలు అనుమానాలు

నిజాంపేట్‌: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్‌కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్‌ కాలనీలోని ఎంఎస్‌ఆర్‌ ప్లాజా బి బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు.

 పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్‌ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్‌ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్‌తో కాపురానికి పంపించారు.  

విచక్షణ కోల్పోయి..
రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్‌ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్‌ను లీక్‌ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్‌ వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్‌ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు.  

హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... 
భార్యను హత్య చేసిన భరద్వాజ్‌ చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్‌కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

పసికందు ముందే.. 
కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్‌ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.  

పోలీసుల వివరణ 
మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో  సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.

అన్నీ అనుమానాలే.. 
మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్‌మెంట్‌ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement