విమానంలో తీసుకెళ్లలేదని అలిగి మహిళ ఆత్మహత్య | Hyderabad Married Women N Pravallika Commits Suicide - Sakshi Telugu
Sakshi News home page

తిరుపతి తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య

Published Fri, Oct 18 2019 11:22 AM | Last Updated on Fri, Oct 18 2019 3:07 PM

Married Woman Commits Suicide in Hyderabad - Sakshi

ప్రవళ్లిక(ఫైల్‌)

బంజారాహిల్స్‌: విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని అలిగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె 2014లో ఎస్పీఆర్‌హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన వెంకటరమణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె రిత్విక. ఈ నెల 10న రిత్విక పుట్టు వెంట్రుకలు తీసేందుకు వెంకటరమణ కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు  రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నారు.

అయితే అనివార్యకారణాలతో  ప్రయాణం వాయిదా పడింది. అయితే అందుకు అంగీకరించని ప్రవళ్లిక ఇద్దరం కలిసి విమానంలో తిరుపతి వెళ్లి వద్దామని కోరింది. అందుకు వెంకటరమణ అంగీకరించకపోగా వారం తర్వాత తన తల్లిదండ్రులతో  కలిసి రైలులో వెళ్దామని నచ్చజెప్పాడు. ఈ నేపథ్యంలో గత రెండ్రోసులుగా వారి మధ్య గొడవ జరుగుతోంది. బుధవారం సాయంత్రం డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. గురువారం ఉదయం వెంకటరమణ లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో అతను ఆమెను కిందకు దింపి మోతీనగర్‌లోని నీలిమా ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త వేధింపులు తాళలేక భార్య..
బంజారాహిల్స్‌:  భర్త, తోటి కోడలు వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, కొండచాకరపల్లి గ్రామానికి చెందిన గీత(20) కొండాపూర్‌లోని గూగూల్‌ సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ విభాగంలో పని చేసేది. ఐదు నెలల క్రితం అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ  ఎన్బీటీ నగర్‌లో అద్దెకుంటున్నారు. ప్రస్తుతం గీత గర్భిణి. మంగళవారం రాత్రి విజయ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి  మద్యం తాగాడు. దీనిపై గీత నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం డ్యూటీ వెళ్లి వచ్చిన గీత సాయంత్రం తన గదిలో చున్నీతో వెంటిలేటర్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నైట్‌ డ్యూటీకి వెళ్లిన విజయ్‌ గురువారం ఉదయం దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. గత కొంతకాలంగా భర్తతో పాటు ఆమె తోటి కోడలు వేధిస్తున్నారని ఫోన్‌ చేసి చెప్పినట్లు మృతి రాలి తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తండ్రి మందలించాడని యువకుడు..
మేడ్చల్‌: తండ్రి మందలించాడని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని అత్వెలి గ్రామానికి చెందిన గడ్డం యాదయ్యకు నలుగురు సంతానం. వీరిలో చిన్న కుమారుడైన శ్యాంరావు(26) ఖాలీగా తిరుగుతుండటంతో యాదయ్య అతడిని మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన శ్యాంరావు బుధవారం రాత్రి వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు   తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement