లావణ్య మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి శ్రీదేవి, పిల్లలు
పెళ్లై పదేళ్లు కాలేదు...ఇద్దరు పిల్లలు...ఏమైందో తెలియదు...భర్తను కాదని, పిల్లలను అనాథలుగా చేసి ఓ వివాహిత విగత జీవిగా మారింది. ఇది హత్యేనని కన్నవారింటి వారు...లేదు ఆత్మహత్యే చేసుకుందాని అత్తింటివారు ఎవరి వాదన వారు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సిందే! వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటకు చెందిన ఎల్లపు లావణ్య(25) సోమవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామంలో ఎల్లపు రవికుమార్, లావణ్యకు 2010లో వివాహమైంది. వీరికి నరేష్, జోషియా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవికుమార్ రెప్‌కో బ్యాంకులో కొంత కాలం పని చేసి ప్రస్తుతం విశాఖపట్నం టైకూన్ రెస్టారెంట్ సమీపంలో రివెగర్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రవికుమార్, లావణ్య వివాహ జీవితం సాఫీగానే సాగుతోందన్న క్రమంలో రవికుమార్ మూడో అన్న నరేష్ మృతి చెందడంతో తన వదినకు ఏ లోటు రాకుండా రవే చూసుకుంటున్నాడు. అక్కడే వీరి జీవితంలో మలుపులు తిరిగాయి. తన తోటికోడలపై చూపుతున్న ప్రేమ లావణ్యపై రవికుమార్ చూపకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తల్లి శ్రీదేవి తెలిపింది.
పండగకి వచ్చినపుడు కూడా తనింటికి రాకుండా వదిన ఇంటికే తన అల్లుడు వెళ్లడంపై తాను, లావణ్య అత్తమామలను నిలదీశామని ఆమె చెప్పింది. దీన్ని తట్టుకోలేని అత్తింటి వారు తన కుమార్తె లావణ్యను కొన్నాళ్లుగా మానసికంగా వేధిస్తూ గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపించింది. కొంత కాలంగా రవి భార్య లావణ్యతో మాట్లాడడం లేదని ఆయన పనిచేసే కార్యాలయంలో ఓ సహద్యోగితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడన్న అనుమానం లావణ్య వ్యక్తం చేసేదని తల్లి తెలిపింది. ఈ విషయంపై తన కుమార్తె లావణ్యను రోజూ హింసించేవారని తల్లి శ్రీదేవి తెలిపారు. తన మనవళ్లను అన్యాయం చేశారంటూ అల్లారు ముద్దుగా పెంచిన తర కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరైంది. లావణ్యకు కడుపునొప్పి వచ్చిందని అత్తింటి వారు కబురు పంపగా వెళ్లేసరికే ఇంట్లోనే సోఫాలో లావణ్య మృతదేహం ఉండడం చూశామని బంధువు ఉమామహేశ్వరి రోదిస్తూ చెప్పారు. అత్తింటి వారే చంపేసి లావణ్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించే కట్టుకథలు అల్లుతున్నారని లావణ్య బంధువులు ఆరోపించారు. లావణ్యను అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఆమె బావ ప్రసాద్(తెలుగుదేశం పార్టీ కార్యకర్త) ప్రయత్నిస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్ భర్త పిల్లా అప్పలరాజు సహాయంతో కేసు తారుమారు చేసేందుకు పోలీసుల్ని మేనేజ్ చేస్తూ ప్రలోభపెడుతున్నారని లావణ్య మేనమామ వెలగ అప్పారావు విలేకరుల ముందు ఆరోపించారు. ఇదే విషయమై లావణ్య భర్త రవికుమార్‌ను సాక్షి వివరాలు కోరగా రాత్రి తొమ్మిది గంటలకు ఆఫీసు నుంచి వచ్చానని టిఫెన్ చేయమని కోరిందని తాను తినలేదని, రాత్రి ఒంటి గంట సమయంలో చూస్తే లావణ్య ఉరి వేసుకుని ఉందని తెలిపాడు. భయంతో లావణ్య మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి దించి సోఫాలో పడుకోబెట్టానని తనకు ఏం తెలియదని పేర్కొన్నాడు.
దర్యాప్తు చేస్తున్నాం...
లావణ్య తల్దిండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇది హత్యా! ఆత్మహత్యా! అన్నది తేలాల్సి ఉందని చెప్పారు. రవికుమార్‌పై కేసు నమోదు చేశామని విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment